Ponnam: సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ గా హైదరాబాద్.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ను మార్చుతామని, భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-10-02 07:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ను మార్చుతామని, భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం, సీవరేజ్ పైప్‌లైన్ వ్యర్ధాల తొలగింపు కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ అనుదీప్ దురిషెట్టీ, ఎమ్మేల్యే మాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో నిర్మించిన ఇంకుడు గుంతను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్వహణపై డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నామని, హైదరాబాద్ లో వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అలాగే సీవరేజ్ సమస్యలపై.. నిత్యం పొంగే మ్యాన్ హోళ్లు గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, మురుగు నీటిని ఎస్‌టీపీల ద్వారా శుభ్రం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ల సామర్ధ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా కాలం చెల్లిన పైప్ లైన్ల మార్పునకు ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పారు. ఇక క్షేత్రస్థాయి పనులపై జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నామని, సీవరేజ్ సమస్య 3 నెలల్లో 30 శాతానికి తగ్గించాలదే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. గాంధీ జయంతి నుంచి సీవరేజ్ స్పెషల్ డ్రైవ్ అమలుకు శ్రీకారం చుట్టామని, సీవరేజ్ ఓవర్ ఫ్రో ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. 


Similar News