బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేపీ వివేక్ హెచ్చరిక

బడ్జెట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు..

Update: 2025-03-20 16:52 GMT
బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేపీ వివేక్ హెచ్చరిక
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. హైదరాబాద్ నగరంపై ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తామని.. అప్పటికీ ప్రభుత్వం చలించకుంటే ఆందోళన, ధర్నాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 15 నెలల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదని.. చేసేది కూడా ఏమీ లేదని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్ నగరాన్ని విస్మరించారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ప్రసంగం పూర్తిగా అవాస్తవాలతో కూడిందని, 150 పేరాగ్రాఫ్‌లు, 72 పేజీలతో బడ్జెట్‌ను మొక్కుబడిగా రూపొందించారన్నారు. గతేడాది బడ్జెట్‌ను మక్కికి మక్కి దించారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి సుమారు 11 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంత ఘోరమైన బడ్జెట్‌లా ఏ బడ్జెట్ లేదన్నారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా మళ్లీ ఆ బడ్జెట్ అంకెలనే ప్రవేశపెట్టి అంకెల గారడి చేశారని ఆరోపించారు.

రాష్ట్రానికి ఆదాయం సుమారు 60 శాతం హైదరాబాద్ నుంచి వస్తుందని, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసి నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని, అందుకే దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ స్థాయిలో అభివృద్ధి చెందిందని చెప్పారు. నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనుల్లో ఎటువంటి పురోగతి లేదన్నారు. మెట్రో రైల్ 2,3 ఫేస్‌లలో గతంలో కేటాయించిన నిధులనే విడుదల చేయలేదని, దీంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. ఊహలనగర అభివృద్ధికి కేంద్ర నిధులపై ఆధారపడడం దారుణమన్నారు. నార్త్ హైదరాబాద్ మెట్రో అభివృద్ధి పనుల్లో ఎటువంటి ముందడుగు లేదని, ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ సిటీ, స్కిల్ ఇండియా పేరుతో ప్రభుత్వం చేస్తున్న హైరానాకు గ్రేటర్ హైదరాబాద్ వాసులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఇన్‌సైడ్ ట్రేడింగ్, భూదందా చేస్తున్నదని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాదులో దాదాపు 40 శాతం వీధిలైట్లు వెలగడం లేదన్నారు. జీహెచ్ఎంససీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదనే కోపంతోనే ఇక్కడి ప్రజలపై పగబట్టి తన అక్కసును చూపిస్తున్నదని పేర్కొన్నారు. 31 ఫ్లైఓవర్ల పనులు, 17 అండర్ పాస్‌ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ నుంచి ఒక్క శాసనసభ్యుడు, ఒక ఎమ్మెల్సీ కూడా మంత్రి పదవికి అర్హుడు కాడా అని నిలదీశారు.

Similar News