ముస్లిం ధోబి ఘాట్లకు ఉచిత విద్యుత్.. బండి సంజయ్ తీవ్ర అభ్యంతరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తప్పుబట్టారు..
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తప్పుబట్టారు. తరతరాలుగా ధోబి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులకు ఉపాధి పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు చాలా మంది రజక కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రతి గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్లు లాండ్రీ షాపులు పెడతారని బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీని సంతోష పెట్టేందుకే ముస్లిం వాషర్లకు సీఎం కేసీఆర్ 250 యూనిట్ల ఉచిత్ విద్యుత్ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడటానికి రజకులను నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ఈ నయా నిజాంలో మత పిచ్చి బాగా పెరిగిందని విమర్శించారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల్లోని కులవృత్తులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కులవృత్తులపై ఆధారపడిన బీసీలు, ఎస్సీలకు సీఎం కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.