కేసీఆర్... వారిని చూసైనా కాస్త నేర్చుకో : విఠల్
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలేదని... BJP Leader Vittal hits out at CM KCR
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలేదని, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలైనా స్థానికులకు కల్పించేలా ఉత్తర్వులు తీసుకురావాలని బీజేపీ నేత విఠల్ డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్.. తెలంగాణలో నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కొత్త సంస్థలు ఎన్ని వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం గూగుల్, అమెజాన్ తప్పా.. కొత్తగా వచ్చిన ఐటీ కంపెనీలు ఏమున్నాయో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు లోకల్ వారికి ఇవ్వాలనే జీవోను తీసుకొచ్చారని, వారిని చూసైనా కాస్త నేర్చుకోవాలని కేసీఆర్ కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వడం లేదని, కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు అయినా స్థానికులకు కల్పించేలా చూడాలన్నారు. పత్రికల్లో ప్రకటనల కోసమే దావోస్ వెళ్లి పెట్టుబడులు తెస్తున్నట్లు గొప్పులు చెప్పుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఈ అన్ని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని విఠల్ డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల్లోనే కాకుండా.. మొత్తంగా చూసుకున్నా ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని విఠల్ వెల్లడించారు. ఇంతటి నీచ పరిస్థితికి దిగడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని ఆయన నిలదీశారు.