ఆటో డ్రైవర్ల 'ఛలో అసెంబ్లీ' తీవ్ర ఉద్రిక్తం

గత 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

Update: 2024-12-20 12:39 GMT

దిశ, హిమాయత్ నగర్ : గత 12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నిర్వహించిన ఆటో డ్రైవర్ల 'ఛలో అసెంబ్లీ' తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శుక్రవారం హిమాయత్ నగర్ ప్రధాన రహదారిపై వచ్చి వేలాదిమంది ఆటో డ్రైవర్ల జెండాలు, ప్లకార్డులు చేతబూని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొనగా, తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆటో డ్రైవర్ల రోడ్డుపై పడుకుని నిరసన తెలుపగా, పోలీసులు అతికష్టం మీద బలవంతంగా నిరసనకారులను అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టైన వారిలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ నేతలు బి. వెంకటేశం (ఏఐటీయూసీ), ఎంఏ. సలీం, ఎండి. నజీర్ (యు.టి.ఏ. డబ్ల్యూ.ఏ), వి.మారయ్య, ఎస్. రాంకిషన్ (బి.ఆర్.టి.యు), ఏ. సత్తిరెడ్డి (టిఏడిఎస్), వి. ప్రవీణ్ (టియుసిఐ), ఏ. బిక్షపతి యాదవ్, సిహెచ్. జంగయ్య, ఎస్. అశోక్, ఎండి. ఒమర్ ఖాన్, మల్లికార్జున్, ఎస్కె. లతీఫ్ (ఏఐటీయూసీ) లక్ష్మణ్ (సిఐటియు) లు ఉన్నారు.

ఈ సందర్భంగా బి. వెంకటేశం మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 12 వేలు ఆర్థిక సహాయం, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, అలాగే పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచమని, 20 వేల కొత్త ఆటో పర్మిట్లను జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని బి. వెంకటేశం హెచ్చరించారు.


Similar News