84వ నుమాయిష్ కు ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 84 వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) 2025 జనవరి 3 న ప్రారంభించనున్నట్లు

Update: 2024-12-29 14:32 GMT

దిశ,కార్వాన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 84 వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) 2025 జనవరి 3 న ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ బి ప్రభా శంకర్ తెలిపారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోని గాంధీ సెంటెనరీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ ఉపాద్యక్షుడు కె నిరంజన్, కార్యదర్శి బి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి మోహన్ తో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జనవరి 3 న నుమాయిష్ ను ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం కారణంగా నుమయిష్ ను జనవరి 3 న ఇనాగ్రేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ కు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉందని అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. అంతేకాకుండా దేశ నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడంతో వాటి విక్రయాలకు కేంద్రంగా నిలిచిందన్నారు. 26 ఎకరాల సువిశాలమైన స్థలంలో నిర్వహిస్తున్న నుమాయిష్ కు దాదాపు 2000 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర శాఖలు కూడా స్టాల్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మూడు నెలల పాటు పది వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని వివరించారు. వచ్చిన ఆదాయంతో 20 విద్యా సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి చర్యలు తీసుకుంటున్నామని, ఆయా కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 30 వేల మంది విద్యను అభ్యసిస్తుండగా 2500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10:30 వరకు మరియు శని ఆదివారాల్లో 11 గంటల వరకు సమయం కేటాయించినట్లు తెలిపారు. గాంధీభవన్ నుంచి మియాపూర్ ఎల్బీనగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. టికెట్టు ధర 50 రూపాయలు, ఐదు సంవత్సరాల చిన్న పిల్లలకు ఉచితం,సీనియర్ సిటిజనులు వీక్షించేందుకు వీల్ చైర్ లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఫ్రీ పార్కింగ్ తో పాటు యశోద గ్రూప్ అఫ్ కంపెనీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

డిజిటల్ లావాదేవీలు, టిఎస్ఆర్టిసి, మరుగుదొడ్లు, ప్రైవేట్ సెక్యూరిటీలు, వాలంటరీలు, సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటాయని ఎలాంటి ఫిర్యాదులు ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీ లేదా రిసెప్షన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. మంత్రులు రోడ్లు,భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట,తెలంగాణ ప్రభుత్వ రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్అ తిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వినర్కు, వినయ్ కుమార్ ముదిరాజ్, అనిల్ స్వరూప్ మిశ్రా, ఆదిత్య మార్గం, అశ్విన్ మార్గం తదితరులు పాల్గొన్నారు.

హైలెట్స్...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,యూనియన్ బ్యాంక్,అటవీ శాఖ, జైళ్ల శాఖ, ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్,తెలంగాణ ఖాదీ & గ్రామ పరిశ్రమల బోర్డు,తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్,తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ,హైదరాబాద్ పోలీస్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్,అంకిత్ స్టూడియో,చిమ్నీ వరల్డ్,భాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్,ఇండస్ట్రీస్,లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.తెలంగాణ పారిశ్రామికవేత్తల సంక్షేమ సమాఖ్య (సిడ్బి) విద్యా సంస్థలు, ఏటీఎంలు, ఎల్ఈడిలు, ట్రేడ్ లైసెన్స్, ఆస్తి పన్నులతో పాటు మహిళల భద్రతకు ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Similar News