బల్దియాలో ఉత్తుత్తి కమిటీలు

జీహెచ్ఎంసీలో ఏ తప్పిదం జరిగినా దాన్ని సరిచేసుకోవల్సింది పోయి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-08-13 01:55 GMT

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో ఏ తప్పిదం జరిగినా దాన్ని సరిచేసుకోవల్సింది పోయి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే ఎక్కువగా జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెంగీ వ్యాధితో, కుక్క కాట్లతో చిన్నారులు బలవుతున్నప్పుడు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దృష్టి మళ్లించేందుకు కమిటీలు నియమించటం, ఆ తర్వాత అంత షరా మామూలే అన్నట్టుగా వ్యవహరించటం బల్దియాలో ఆనవాయితీగా మారిందని కొందరు కార్పొరేటర్లు, మరి కొందరు అధికారులే బాహాటంగా వ్యాఖ్యానించడం గమనార్హం. గడిచిన ఏడాది కాలంలో వివిధ రకాలుగా వెలుగులోకి వచ్చిన బల్దియా వైఫల్యాలకు సంబంధించి నియమించిన ఏడు కమిటీలు ఉత్తుత్తి కమిటీలుగానే తయారయ్యాయే తప్ప, నియమించిన అంశానికి సంబంధించిన ఒక్కసారి కూడా అధికారులతో గానీ, నిపుణులతో గానీ సమావేశమైన దాఖలాలు చాలా తక్కువే.

గత సంవత్సరం అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ పై కుక్కులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర దుమారం రేపడంతో కుక్కల నియంత్రణ పై హైపవర్ కమిటీని నియమించారు. కానీ ఇప్పటి వరకు ఈ కమిటీ సమావేశమైన దాఖలాల్లేవ్. పైగా కమిటీ చేసిన సిఫార్సులు మళ్లీ అధికారుల అక్రమార్జనకు అవకాశమిచ్చాయే తప్పా, కుక్కల నియంత్రణకు ఏమాత్రం చేయూతనివ్వలేదనే చెప్పవచ్చు. దీనికి తోడు గత సర్కారు హయాంలో అడ్వర్‌టైజ్‌మెంట్లలో భారీగా అక్రమాలు జరిగాయని హైపవర్ కమిటీని నియమించిన పాలకమండలి అంతటితో తన పనైపోయిందని విషయాన్ని గాలికొదిలేయటం విమర్శలకు తావిస్తోంది. ఏడాదిన్నర క్రితం మహిళ ఉద్యోగుల వేధింపు నివారణ కోసం కమిటీని వేసినా, ఆ కమిటీ కేవలం ఉన్నత హోదాల్లో కొనసాగుతున్న అధికారులకే పరిమితమైందే తప్పా, క్షేత్రస్థాయిలో అనేక వేధింపులకు గురవుతున్న మహిళా స్వీపర్ల బాధలను పట్టించుకోవడం లేదని వాదనలున్నాయి.

కమిటీలు వేశారు..టైమ్ ఇవ్వరు..

హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి జీహెచ్ఎంసీ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 27న హైదరాబాద్ నగరాన్ని హార్టికల్చర్, ఆర్కిటెక్, మహిళా ఉద్యోగుల వేధింపుల నివారణ అనే మూడంశాల ప్రాతిపదిన ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేసేందుకు మూడు కమిటీలను నియమించారు. ఈ కమిటీ కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే సిఫార్సులు సమర్పించాలని డెడ్‌లైన్ గడువు విధించిన కమిషనరే చర్చించేందుకు సమయమివ్వలేదని సమాచారం. ఉద్యోగుల అంతర్గత బదిలీల కోసం కొద్ది రోజుల క్రితం కమిషనర్ నలుగురు అదనపు కమిషనర్లతో నియమించిన కమిటీ జూనియర్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, సూపరింటెండెంట్ క్యాటగిరీలకు సంబంధించి బదిలీల కసరత్తు పూర్తిచేసి కమిషనర్‌కు నివేదిక సమర్పించి అయిదారు రోజులు గడుస్తున్నా కమిషనర్ ఆ నివేదికపై తుది నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లోనే పెట్టినట్లు సమాచారం.


Similar News