ప్రధాని పర్యటన నేపథ్యంలో ఓయూలో విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్టులు
ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి నుండి పలువురి విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి నుండి పలువురి విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ విద్యార్థి సంఘంతో పాటు, పలు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో.. శాంతి భద్రతల దృష్యా ముందస్తుగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. మోడీ పర్యటన సందర్భంగా నిద్రిస్తున్న విద్యార్థి నాయకులను అర్థరాత్రి హాస్టళ్లకు వచ్చి ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన నుండి మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించిన అభివృద్ధిపై మౌనంగా ఉండటం బాధాకరం అన్నారు. ప్రతి పౌరునికి బ్యాంక్ అకౌంట్లో రూ, పది లక్షలు వేస్తానన్న ప్రధాని మోసం చేశాడని మండిపడ్డారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ ప్రైవేటు శక్తులకు అప్పగించి.. అంబానీ, ఆదాని లకు దేశ సంపద దోషి పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గిరిజన సెంట్రల్ యునివర్సిటీకి మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ కాలేజ్ రానీయకుండా తెలంగాణ విద్యార్దులకు మెడికల్ విద్య దూరం చేయాలనే కుట్రలో ఉన్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి నే, బీఆర్ఎస్వి దశరథ్, కోతి విజయ్, జంగయ్య, నాగేందర్, వెంకట్ తదితరులు ఉన్నారు.