ALERT: వాహనదారులకు అలర్ట్.. సిటీలో 3 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో వాహనదారులకు పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలు జరగనున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో వాహనదారులకు పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఆంక్షలపై, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ పి. విశ్వప్రసాద్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. బల్కంపేట లోని ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకల నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయని వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని సూచించారు.
గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం వైపు నుంచి సత్యం థియేటర్ మీదుగా ఫతేనగర్ వెళ్లే వాహనాలు బల్కంపేట మీదుగా అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అయితే, సత్యం థియేటర్ మీదుగా ఎస్సార్‌నగర్ టీ-జంక్షన్ నుంచి ఎస్సార్‌నగర్ కమ్యూనిటీహాల్ కూడలి నుంచి బీకేగూడ, శ్రీరామ్‌నగర్ ఎక్స్ రోడ్డు మీదుగా ఫతేనగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి బల్కంపేట మీదుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి. భక్తుల పార్కింగ్ స్థలాలను సైతం ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్, ఫతేనగర్ రైల్వే వంతెన కింద, ఆర్‌అండ్‌బీ కార్యాలయం వైపు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సహాయం కోసం నం. 90102 03626 కు కాల్ చేయవచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.