terrible accident : ప్రధాన రహదారిలో నేలకొరిగిన భారీ వృక్షం..
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మాత్తుగా భారీ వృక్షం వేళ్ళతో సహా నడిరోడ్డుపై నేలకొరగడం తో ఒకరు మృతి చెందడంతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
దిశ, చార్మినార్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మాత్తుగా భారీ వృక్షం వేళ్ళతో సహా నడిరోడ్డుపై నేలకొరగడం తో ఒకరు మృతి చెందడంతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు యాక్టివా బైక్‌లతో పాటు, ఒక గూడ్స్ ఆటో ధ్వంసమయింది. వివరాలలోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం 2.27గంటల ప్రాంతంలో శంషీర్‌గంజ్ నుంచి గోశాలకు వెళ్లే ప్రధాన రహదారిలో సులభ్ కాంప్లెక్స్ కు అలియాబాద్ వాటర్‌వర్క్స్ కార్యాలయానికి మధ్యలో ఉన్న కొండ చింత అనే 15 ఏళ్ల భారీ వృక్షం (పెల్టోఫోరం) వేళ్లతో సహా నేలకొరిగింది. దీంతో గోశాల నుంచి శంషీర్ గంజ్‌కు, శంషీర్ గంజ్ నుంచి గోశాలకు రాకపోకలు సాగిస్తున్న మూడు ద్విచక్రవాహనాల పై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో యాక్టివా బైక్ పై వెళ్తున్న చందూలాల్ బాలాదరికి చెందిన మొహమ్మద్ సాలే (65)కి, చాంద్రాయణగుట్టకు చెందిన షేక్ అహ్మద్ (43)లకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేగాకుండా యాక్టివా బైక్ పై గోశాల నుంచి శంషీర్ గంజ్ వైపునకు తల్లీ కొడుకులు వెళ్తుండగా, అదే సమయంలో చెట్టు కూలడంతో తల్లిని ప్రమాదం నుంచి తప్పించబోయి కొడుకు కాలికి గాయలయ్యాయి. గూడ్స్ ఆటోలో చాక్లెట్లు సరఫరా చేస్తున్న మొహమ్మద్ ఇబ్రహీం అదే సమయంలో రోడ్డు పక్కన పార్కు చేసి కిరాణా దుకాణంలోకి వెళ్తుండగానే చెట్టు కూలింది. తీవ్రంగా గాయపడిన మొహమ్మద్ సాలేను, షేక్ అహ్మద్‌లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొహమ్మద్ సాలే మృతిచెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న శాలిబండ ఇన్స్పెక్టర్ రవికుమార్ తన బృందంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి, వాహనాలను మరో రూట్లో మళ్ళించారు. శాలిబండ పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎలక్ర్టిసిటీ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే ఆరూట్లో అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. భారీ వృక్షం కింద చిక్కుకున్న బైక్‌లను పక్కకు జరిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును శాలిబండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.