Police Battalion : స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో ఆందోళనలకు 10 మంది బాధ్యులు..

పోలీస్ మాన్యువల్, పోలీస్ ఫోర్సెస్, పోలీసు యాక్ట్ నిబంధనలకు, మార్గ దర్శకాలకు విరుద్ధంగా పోలీసు ప్రతిష్టను దిగజార్చి, కించ పరిచే విధంగా ప్రవర్తిస్తే శాఖ పరంగా కఠిన చర్యలు తప్పవని తెలంగాణ స్పెషల్ పోలీసు ( Special Police Battalion ) అదనపు డీజీ సంజయ్ జైన్ హెచ్చరించారు.

Update: 2024-10-28 05:09 GMT

దిశ, సిటీ క్రైం : పోలీస్ మాన్యువల్, పోలీస్ ఫోర్సెస్, పోలీసు యాక్ట్ నిబంధనలకు, మార్గ దర్శకాలకు విరుద్ధంగా పోలీసు ప్రతిష్టను దిగజార్చి, కించ పరిచే విధంగా ప్రవర్తిస్తే శాఖ పరంగా కఠిన చర్యలు తప్పవని తెలంగాణ స్పెషల్ పోలీసు ( Special Police Battalion ) అదనపు డీజీ సంజయ్ జైన్ హెచ్చరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో చోటుచేసుకున్న నిరసనలు, ఆందోళనలు, ధర్నాల పై విచారణ జరిపారు. ఈ ఆందోళనలకు కారణమైన 10 మంది హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి అధికారులను పోలీస్ శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ అదనపు డీజీ సంజయ్ జైన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఏ అధికారి వ్యవహరించినా, ప్రవర్తించినా సహించేది లేదని అదనపు డీజీ ( Additional DG ) స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2) (b) ప్రకారం ఈ 10 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు అదనపు డీజీ వివరించారు. యూనిఫామ్ సర్వీస్ లో క్రమశిక్షణను అతిక్రమించి దారి తప్పి ప్రవర్తిస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. విచారణలో 3, 6, 12, 17 బెటాలియన్ లకు చెందిన ఈ 10 మంది కారణమని ఆధారాలు లభించడం ఉద్యోగం నుంచి తొలగించామని అదనపు డీజీ పేర్కొన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే బెటాలియన్ లో నిర్వహించే దర్బార్ లో అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు.

Tags:    

Similar News