BRS vs Police: బీఆర్ఎస్‌ పార్టీకి హైదరాబాద్ పోలీస్ కౌంటర్ ట్వీట్

తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్లు యువకులు ప్రకటించారు.

Update: 2024-07-28 09:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయనున్నట్లు యువకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువరు నిరుద్యోగులు శనివారం హైదరాబాద్‌ అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘మరీ ఇంత దుర్మార్గమా! నిరుద్యోగులు భిక్షాటన చేయగా వారికి డబ్బులు ఇచ్చిందని ఒక మహిళను బలవంతంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు’ అని ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వేసిన ట్వీట్‌పై ఇవాళ హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించింది.

‘నిజాలు తెలుసుకొని మీరు ఇక్కడ పోస్ట్ పెట్టి ఉంటే బాగుండేది. మీరు పెట్టిన పోస్ట్ ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. మీరు వీడియోలో చూపించిన అమ్మాయితో పాటు మరికొందరు ధర్నా చేస్తుండగా వారు షాప్స్‌లోకి వెళ్లి బిక్షాటన చేస్తున్నారు అని షాప్స్ వారు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌లు అక్కడకి చేరుకొని ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా అక్కడ ఉన్న వారిని పంపి వేసే క్రమంలో అట్టి అమ్మాయి వారి నుంచి తప్పించుకొని పక్కన ఉన్న ఒక అకాడమీ లోకి వెళ్లింది. తాను ఇక్కడ పని చేసే అమ్మాయి గా చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పోలీస్ వారు మీరు చెప్పినట్టు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు’ అని హైదరాబాద్ సిటీ పోలీస్ రిప్లై ఇచ్చింది.

 

Tags:    

Similar News