కేబీఆర్​ పార్కులో కొత్తగా 153 సీసీ కెమెరాలు.. ప్రారంభించిన కొత్వాల్ ఆనంద్

నేరాలను నియంత్రించటంతోపాటు కేసుల సత్వర పరిష్కారంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.

Update: 2023-07-15 14:56 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నేరాలను నియంత్రించటంతోపాటు కేసుల సత్వర పరిష్కారంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని హైదరాబాద్​ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. దేశం మొత్తం మీద అత్యధికంగా సీసీ కెమెరాలు ఉన్న నగరం హైదరాబాద్ ​అని తెలిపారు. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో కొత్తగా ఏర్పాటు చేసిన 153 సీసీ కెమెరాలను కమిషనర్​ ఆనంద్​ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 62 శాతం ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నట్టు చెబుతూ దీంట్లో ప్రజల భాగస్వామ్యం విశేషంగా ఉందన్నారు. కేబీఆర్​ పార్కులో త్వరలోనే మరో 111 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలియచేశారు. నేరాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు కేసులను వేగంగా పరిష్కరించటంలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెబుతూ కొన్ని కేసులను ఉదహరించారు.

సీసీ కెమెరాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించటం ద్వారా వీటి ఏర్పాటులో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కొన్నింటికి మరమ్మత్తులు అవసరమని, మరికొన్నింటిని పూర్తిగా మార్చాల్సిన అవసరముందన్నారు. దీని కోసం కొత్తగా కెమెరా మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కేబీఆర్ పార్కులో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రెయిన్​ బో హాస్పిటల్ ​ఎండీ సునీల్​ రెడ్డి దొడ్ల, ఒమెగా ఆస్పత్రి ఎండీ నమ్రత, సిటీ న్యూరో హాస్పిటల్ ​ఎండీ సాంబశివ రెడ్డిలకు అభినందనలు తెలిపారు. ముగ్గురికి పోలీసుశాఖ తరఫున మెమొంటోలు అందచేశారు. కెమెరాల ఏర్పాటులో కీలకపాత్ర వహించిన పశ్చిమ మండలం పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో జాయింట్​కమిషనర్ గజరావు భూపాల్, వెస్ట్​ జోన్ డీసీపీ జోయల్​ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News