HYD: రైతు బిడ్డను చూసి బాధ ఎందుకు?.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి ఫైర్
మార్పును చూస్తే అంత నొప్పెందుకు.. తెలంగాణ తల్లి(Telangana Thalli)ని చూసి కడుపు మంటెందుకని బీఆర్ఎస్ నాయకులను(BRS Leaders) ఉద్దేశించి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి(Khairathabad DCC President Rohin Reddy) ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: మార్పును చూస్తే అంత నొప్పెందుకు.. తెలంగాణ తల్లి(Telangana Thalli)ని చూసి కడుపు మంటెందుకని బీఆర్ఎస్ నాయకులను(BRS Leaders) ఉద్దేశించి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి(Khairathabad DCC President Rohin Reddy) ప్రశ్నించారు. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఫైర్ అయ్యారు. దీనిపై ఆయన.. రైతు బిడ్డ సీఎం(CM) అయితే బాధ ఎందుకని, ఫామ్ హౌజ్(Form House) కు పరిమితం కాకుండా 18 గంటలు పనిచేస్తే ఏడుపెందుకు అని విమర్శలు చేశారు.
అలాగే ఉద్యమానికి ఊపిరిలూదిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర గేయంగా ఆవిష్కరిస్తే ఓర్వలేని గుణమెందుకు అని, చివరికి ప్రతి పల్లెలో కనిపించే సగటు ఆడబిడ్డను ప్రతిబింభించేలా కనిపిస్తున్న తెలంగాణ తల్లిని చూసినా కడుపు మంటెందుకు అని మండిపడ్డారు. ప్రతి ఇంటిలో ఉండే మన అమ్మ రూపంలో తెలంగాణ తల్లి ఉండొద్దా? అని, తెలంగాణ తల్లికి రాచరికపు పోకడలు అద్దాలా? అని నిలదీశారు. అంతేగాక సబ్బండ వర్గాలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు ప్రతిబింబమైన తెలంగాణ తల్లి మన అమ్మలాగే ఉండాలని, నాలుగుకోట్ల ప్రజలను తల్లిలా కాపాడుకునే సగటు ఆడబిడ్డలాగే ఉండాలని, తెలంగాణ తల్లిని చూస్తే అమ్మను చూసిన భావన రావాలని అన్నారు. అయినా పదేళ్ల దొరల పాలనలో రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లిని ఏర్పాటెందుకు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పి.. తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నించండి అని రోహిణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.