Hunger Strike: కుల గణన చేపట్టాలని ఆమరణ నిరాహార దీక్ష

రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-08-24 17:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యావత్ బీసీల తరుపున ఆదివారం నుంచి హైదరాబాద్ లోని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో తాను ఆమరణ దీక్షకు దిగుతున్నానని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన కులగణన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం వాటా పెంచాలని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా బీసీలు పోరాటం చేస్తున్న ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ వారంలో కుల గణన ప్రక్రియ చేపడతామని వ్యాఖ్యానించారని, కానీ ఎలాంటి స్పందన లేదని ఆయన విమర్శలు చేశారు. మరో పక్క ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సిద్ధమవుతోందన్నారు. మొత్తంగా బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని సంజయ్ తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని, కుల గణన ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.


Similar News