ఇందిరమ్మ ఇండ్లకు హడ్కో రుణం!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి హడ్కో రుణం తీసుకునేందుకు సిద్ధమైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి హడ్కో రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ స్కీమ్ అమలు కోసం రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు శనివారం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో) చైర్మన్ సంజయ్ కుల క్షేత్ర, ఆ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రుణానికి సంబంధించి హడ్కో పేర్కొన్న షరతులను అంగీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకున్న నేపథ్యంలో.. లోన్‌కు సంబంధించి మరిన్ని అంశాల ను తదుపరి మీటింగ్‌లో డిస్కస్ చేయాలని ఇరుపక్షాలు ఒక సూత్రప్రాయ (ఇన్ ప్రిన్సిపుల్ అగ్రిమెంట్) అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. ఆ మీటింగ్ ఢిల్లీ లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
నియోజకవర్గానికి 3,500 ఇండ్లు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు నిర్మించాలని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఈ హడ్కో రుణంతో 95,235 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు సర్కార్ నిర్ణయించింది. మరోవైపు.. హడ్కో రుణానికి తెలంగాణ సర్కార్ గ్యారంటీ కూడా ఇచ్చిందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. హడ్కో ఇచ్చే రూ.3,000 కోట్లతో గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా చేపట్టాలని సర్కారు భావిస్తోంది.
అర్హులైన వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఒకవేళ సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలను ఇందిరమ్మ పథకంలో మంజూరు చేయనున్నారు. ఫస్ట్ విడతలో స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే.. హడ్కో నుంచి సేకరించాలనుకుంటున్న రుణంపై మరోసారి ఇటు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు, అటు హడ్కో ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే.. ఆ సమావేశం ఢిల్లీలో జరుగుతుందని తెలిసింది.
రీజినల్ రింగ్ రోడ్డుకూ రుణం
హైదరాబాద్ మహానగరం చుట్టూ పక్కల ప్రాంతాలను మరింత అనుసంధానం చేస్తూ నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం రుణ అన్వేషణ చేస్తున్నది. ఇదివరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రం భరించనుంది. అయితే.. భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తామని ఒప్పుకున్నది. దాంతో భూసేకరణకు రాష్ట్ర వాటా కింద రెండున్నర నుంచి మూడు వేల కోట్ల వరకు అవసరం ఉంది. ఇప్పుడు ఆ నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్నది. హడ్కో నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.8,000 కోట్లు కోరగా, రూ.3,000 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌కు కూడా రుణం కావాలని ప్రభుత్వం కోరుతున్నది.