Hot News: సొల్యూషన్ కోసం ‘కరప్షన్’..! లంచం ఇవ్వకపోతే ఇక అంతే
ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని కొందరు అధికారులు కాస్ట్లీగా మార్చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని కొందరు అధికారులు కాస్ట్లీగా మార్చేశారు. ఎకరానికి ఇంత అని ధర కూడా ఫిక్స్ చేశారనే చర్చ ఉన్నది. 14 గుంటల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రూ.8 లక్షలు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి చిక్కడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ ఘటన తర్వాత ధరణి అప్లికేషన్లను అధికారులు ఉద్దేశపూర్వకంగానే పెండింగ్‌లో పెడుతున్నారనే చర్చ జరుగుతున్నది. ఈ అడిషనల్ కలెక్టర్ పేషీలో ఏకంగా ఏడు వేలకు పైగా అప్లికేషన్లు పెండింగులో ఉండటం గమనార్హం. వీటిలో రెండేండ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులు సైతం ఉన్నాయి. తహశీల్దారు, ఆర్డీవోలు రికమండ్ చేసినా అప్రూవ్ చేయడం లేదని తెలుస్తున్నది.
సొల్యూషన్ ఈజీ చేసినా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చింది. తహశీల్దారు, ఆర్డీవో స్థాయిలో సమస్యలు పరిష్కారమయ్యేలా నిబంధనలు సడలించింది. కానీ కొందరు అవినీతి రెవెన్యూ అధికారుల తీరు వల్ల సొల్యూషన్ సాధ్యం కావడం లేదనే చర్చ ఉన్నది. లంచం డిమాండ్ చేయడం, ఇచ్చినా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. సీసీఎల్ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తే పని చేయకుండా ఫైళ్లను రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో రంగారెడ్డి జిల్లాలో పరిష్కరించిన భూ సమస్యల సంఖ్య వందకు మించి లేవని తెలిసింది. మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది.
‘కరప్షన్’ కోసమే పెండింగ్!
ధరణి దరఖాస్తులను రెండేండ్లకు పైగా పెండింగ్‌లో పెడుతున్నారు. దీంతో సమస్య పరిష్కారానికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా కొందరు రెవెన్యూ ఆఫీసర్లు సొల్యూషన్ కోసం రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అయితే లంచం ఇచ్చి కింది స్థాయి నుంచి రికమండ్ చేయించినా.. కలెక్టర్ నుంచి రిజెక్ట్ అవుతుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కలెక్టర్ అప్రూవ్ చేయాలంటే తహశీల్దార్లు, ఆర్డీవోలు అన్నీ ఫైల్స్ జత చేసి పంపాలి. కానీ ఒకటీ, రెండు తక్కువగా ఉండటంతో రిజెక్ట్ అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కోర్టు కేసు ఉందని, ఆ ల్యాండ్ పార్శిల్‌ను పీవోబీలో పెట్టాలని ఇటీవల దరఖాస్తు చేశారు. అయితే కోర్టు కేసు తీర్పు కాపీ లేటెస్ట్ ది కావాలంటూ రిజెక్ట్ చేశారు. కోర్టు ఆర్డర్ కాపీ ఎప్పటిదైనా దానిపై అప్పీల్‌కు వెళ్తే తప్ప అది చెల్లుబాటవుతుంది. ఈ విషయం ఆ ఆర్డీవోకు తెలిసినా రిజెక్ట్ చేశారు. ఇలా ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేయడం, పెండింగులో పెట్టిన దరఖాస్తుల సంఖ్య వేలల్లోనే కనిపిస్తోంది.
వివిధ స్థాయిల్లో పెండింగ్ దరఖాస్తులు
జిల్లా మొత్తం తహశీల్దార్ ఆర్డీవో అదనపు కలెక్టర్ కలెక్టర్
రంగారెడ్డి 28,237 10,726 6,406 7,175 3,930
సంగారెడ్డి 11,006 2,561 4,846 2,700 899
వికారాబాద్ 10,813 6,141 2,922 1,156 594
నల్లగొండ 7,424 2,716 1,653 1,875 1,207
ఖమ్మం 5,624 1,250 1,136 1,626 1,612
నాగర్ కర్నూలు 5,613 991 650 1,547 2,425
భువనగిరి 5,483 1,607 1,249 1,838 789
ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తహశీల్దార్ల దగ్గర 40 వేలు, ఆర్డీవోల దగ్గర 30 వేలు, అదనపు కలెక్టర్ల దగ్గర 37 వేలు, కలెక్టర్ల దగ్గర 26 వేలకు పైగా పెండింగ్ పెట్టారు.
ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి
హోదా కాల పరిమితి
తహశీల్దార్ - 7 రోజులు
ఆర్డీవో - 3 రోజులు
అదనపు కలెక్టర్ - 3 రోజులు
కలెక్టర్ - 7 రోజులు
దరఖాస్తు చేసిన రెండేండ్లకు కూడా మోక్షం లభించని దరఖాస్తులు ఉన్నాయి. తహశీల్దార్, ఆర్డీవోలు రికమండ్ చేస్తే అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు పెండింగులో పెడుతున్నారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా దరఖాస్తులను రిజెక్ట్ సైతం చేస్తున్నారు.
టాప్ పెండింగ్:
కలెక్టర్ల వద్ద..
జిల్లా పెండింగ్ దరఖాస్తులు
రంగారెడ్డి 3,930
మెదక్ 2,758
నాగర్ కర్నూలు 2,425
ఖమ్మం 1,612
నల్లగొండ 1,207
అదనపు కలెక్టర్లు వద్ద
జిల్లా పెండింగ్ దరఖాస్తులు
రంగారెడ్డి 7,175
సంగారెడ్డి 2,700
మంచిర్యాల 2,118
నల్లగొండ 1,875
యాదాద్రి భువనగిరి 1,838