ఆ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టండి: పోలీసులకు హోంమంత్రి మహమూద్ అలీ కీలక సూచన
హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టటానికి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హత్యలు, హత్యాయత్నాలు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టటానికి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమషనరేట్ల పరిధుల్లో ఈ తరహా నేరాలు ఇటీవలిగా ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్పారు. రాష్ర్టంలోని శాంతిభద్రతల పరిస్థితిపై డాక్టర్బీ.ఆర్.అంబేద్కర్సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ప్రిన్సిపల్సెక్రటరీ జితేందర్, ట్రై కమిషనరేట్ల కమిషనర్లు సీ.వీ.ఆనంద్, స్టీఫెన్రవీంద్ర, డీ.ఎస్.చౌహాన్తదితరులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
కాలనీలు, బస్తీలు, సున్నితమైన ప్రాంతాలు, జంక్షన్ల వద్ద మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టే మెసేజీలను సోషల్‌మీడియాలో పోస్ట్చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని చెప్పారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న నేరాలపై సమీక్షలు జరుపుతూ వాటిని అరికట్టటానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగినట్టు తెలిపారు.
దాంతో పాటు పోలీస్‌వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ జరిగిందని, ఈ క్రమంలో కొత్తగా కమిషనరేట్లు, జిల్లా పోలీస్, సబ్‌డివిజనల్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు ఏర్పాటయ్యాయన్నారు. ఇదంతా శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా కాపాడటానికే అని చెప్పారు. రౌడీషీటర్ల కార్యకలాపాలపై నిఘా పెట్టాలని చెప్పారు. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌నేరాలకు కళ్లెం వేయటానికి మరింత పకడ్భంధీ చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.