Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలపై నేడే హైకోర్టు కీలక ఆదేశాలు ?
గేమ్ ఛేంజర్(Game Changer)సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అనుమతిని సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు(High Court) నేడు కీలక ఆదేశాలు(Key Orders)ఇచ్చే అవకాశముంది.
దిశ, వెబ్ డెస్క్ : గేమ్ ఛేంజర్(Game Changer)సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అనుమతిని సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు(High Court) నేడు కీలక ఆదేశాలు(Key Orders)ఇచ్చే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 8న ఇచ్చిన సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిస్తు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై నిన్న విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి తదుపరి విచారణను నేటి శుక్రవారానికి వాయిదా వేశారు.
పుష్ప 2 సినిమాపై వేసిన పిటిషన్ తో కలిపి విచారణ పూర్తి చేస్తామన్నారు. విచారణ తొలి రోజు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వేళకాని వేళల్లో బెనిఫిట్ షోలు అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. ఇటీవలి(పుష్ప 2) ఉదంతాలు చుసిన తరువాత కూడా మీరు మారరా అంటూ ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేశారు. అభిమాన హీరో సినిమా అయితే ప్రేక్షకులు ఉదయం లేదా తర్వాత రోజుల్లోనైనా చూస్తారన్నారు.
షోల మధ్య కనీస వ్యవధి 15నిమిషాల్లో థియేటర్లలోకి వేలాది వాహనాలు, జనం ఎలా రాకపోకలు సాగిస్తారని.. ప్రజల భద్రత గురించి కనీసం ఆలోచించరా అంటూ నిలదీశారు. సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలని.. అర్దరాత్రి, వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. 16 ఏళ్ల లోపు పిల్లలను అర్దరాత్రి, తెల్లవారుజాము ప్రదర్శనల్లో అనుమతించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. తదుపరి విచారణను నేటీకి వాయిదా వేశారు.
గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారం విడుదైన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ఈ సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలపై ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.