TG: ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ కోఠిలోని మహాత్మాగాంధీ స్మారక నిధి ట్రస్టుకు చెందిన భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట మ్యుటేషన్ చేయడంపై వివరణ

Update: 2024-10-10 14:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ కోఠిలోని మహాత్మాగాంధీ స్మారక నిధి ట్రస్టుకు చెందిన భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట మ్యుటేషన్ చేయడంపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం, సీసీఎల్ఏ, సిద్ధిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవో, సిద్ధిపేట మండల తహసీల్దార్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను, భగవద్గీతను బోధించే గాంధీ స్మారక నిధి ట్రస్టుకు చెందిన భూములను ప్రైవేటు వ్యక్తులపరం చేస్తున్నారని పేర్కొంటూ సిద్ధిపేట్ అర్బన్ మండలానికి చెందిన బాలరంగం, వెంకయ్య, శ్రీనివాస రెడ్డి, ఎద్దురాజు, అరుణ్ కుమార్ తదితరులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

సిద్ధిపేట్ అర్బన్ మండలంలోని పొన్నాల గ్రామం సర్వే నంబర్లు 241, 241ఏఏ లో ఉన్న 5.34 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట మ్యుటేషన్ చేయడం చెల్లదని.. ఈ మేరకు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ నిర్ణయాన్ని కొట్టేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్ట వ్యతిరేకంగా జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. ట్రస్టు భూములను కాపాడాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగువారాలకు వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.


Similar News