Breaking: షర్మిల పాదయాత్రపై High Court కీలక తీర్పు..
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతులకు లోబడి పాదయాత్ర నిర్వహించుకోవచ్చని మంగళవారం స్పష్టం చేసింది. షర్మిల చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన నేపథ్యంలో ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆమె పోలీసులు, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తన పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయినా స్పందన రాకపోవడంతో పాదయాత్రకు అనుమతిచ్చేలా వరంగల్ సీపీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. పాదయాత్రతో పాటు వరంగల్ బహిరంగ సభకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు అనుమతి ఇచ్చినా తర్వాత కూడా పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నాయకులు అందరూ పాదయాత్ర కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కామెంట్ చేసింది.
దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, తెలంగాణను తాలిబన్‌ల రాష్ట్రంగా మారుస్తున్నారని వ్యాఖ్యలు చేశారని వాదించారు. రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చాక షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు టీఆర్ఎస్ నేతలపై షర్మిల అనుచిత వాఖ్యలు చేశారని వాదించారు. దీనిపై స్పందిస్తూ రాజ్ భవన్ దగ్గర వాఖ్యలు చేస్తే పాదయాత్రకు ఎందుకు అనుమతి నిరాకరించారని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై ఇలా వాఖ్యనించడం సరికాదని హైకోర్టు షర్మిలకు సూచించింది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోడం సర్వ సాధారణమని.. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని సూచిస్తూ ఆమె పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని షర్మికలకు షరతు విధించింది. రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలవుతాయని ధర్మాసనం పేర్కొంది.