Telangana Weather Updates: భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల‌పై కుంభ‌వృష్టి.. 8 గంటల్లోనే రికార్డు వర్షపాతం

భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లో కుంభ‌వృష్టి వ‌ర్షం కురిసింది.

Update: 2023-07-27 04:52 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లో కుంభ‌వృష్టి వ‌ర్షం కురిసింది. కేవ‌లం ఎనిమిది గంట‌ల వ్యవధిలోనే భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లోని చిట్యాల‌, రేగొండ‌, గ‌ణ‌పురం, నూగూరు వెంక‌ట‌పూర్ మండ‌లాల్లో రికార్డు స్థాయి వ‌ర్షపాతం న‌మోదైంది. భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లంలో 62సెం.మీ., రేగొండ, గ‌ణ‌పురంలో 46సెం.మీ వ‌ర్షపాతం, ములుగు జిల్లా వెంక‌ట‌పూర్ మండ‌లంలో 53సెం.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. ఫ‌లితంగా ఈ రెండు జిల్లాల్లోని వాగులు, వంక‌లు పొంగిపోర్లుతున్నాయి.

భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రంలోనూ వ‌ర‌ద‌లు పోటెత్తాయి. మంజూరున‌గ‌ర్‌లో పూర్తిగా ఇళ్లన్నీ నీట మునిగాయి. గ‌ణ‌పురం మండ‌లంలో చెల్పూరులో ఓ వ్యక్తి మురికి కాల్వలో ప‌డి కొట్టుకుపోయాడు. మొగుళ్లపల్లి మండ‌లం మోరంచ‌వాగు ఉధృతంగా ప్రవహించ‌డంతో గ్రామం మొత్తం ఆప‌ద‌లో చిక్కుకుపోయింది. దీంతో జ‌నాలు, ఇళ్లు, చెట్లపైకి చేరుకుని ర‌క్షించాల‌ని వేడుకుంటున్నారు. ఇప్పటి వ‌ర‌కు ముగ్గురు చ‌నిపోయిన‌ట్లుగా తెలుస్తుండ‌గా, సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంద‌ని గ్రామ‌స్థుల ద్వారా తెలుస్తోంది. ములుగు జిల్లాలో జంప‌న్నవాగు, బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి - ప‌స్రాల మ‌ధ్య ఉన్న ర‌హ‌దారి వ‌ర‌ద ఉధృతికి కొట్టుకుపోయింది.

Tags:    

Similar News