Hyderabad :హైదరాబాద్ అల్లకల్లోలం.. భయం గుప్పిట్లో ఆ ప్రాంత ప్రజలు
హైదరాబాద్‌లో మరోసారి వర్షం విజృంభించింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన కాలనీ, బస్తీలు ఇంకా సెట్ అవ్వకముందే మంగళవారం ఉదయం మరోసారి వర్షం ప్రారంభమైంది.
దిశ సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో మరోసారి వర్షం విజృంభించింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన కాలనీ, బస్తీలు ఇంకా సెట్ అవ్వకముందే మంగళవారం ఉదయం మరోసారి వర్షం ప్రారంభమైంది. అత్యధికంగా శివరాంపల్లిలో 6.4 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. గ్రేటర్ హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్‌లకు ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
రాజేంద్రనగర్ సమీపంలోని అత్తాపూర్‌లోని హన్స్‌రాజ్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్‌పై పిడుగుపడింది. చారిత్రాత్మకమైన నాంపల్లిలోని యూసుఫ్ ఎన్ దర్గాలోకి భారీగా వరదనీరు చేరింది. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్‌లోకి కూడా భారీగా వరద నీరు చేరుతుండడంతో నీటిమట్టం 513.50 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఉదయం భారీ వర్షం కురవడంతో ఆఫీసు వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. మెయిన్ రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఈవీడీఎం బృందాలు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా, మంగళవారం ఉదయం ఎక్కడా కూడా సహాయ చర్యలు చేపట్టలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ::
Heavy Rains : ప్రభుత్వానికి వాతావరణ శాఖ కీలక సూచన
Telangana weather update: నీట మునిగిన మంత్రి సొంత గ్రామం (వీడియో)