యోగాతోనే ఆరోగ్యం : మంత్రి దామోదర రాజనర్సింహా

ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగం చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా సూచించారు.

Update: 2024-06-20 14:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగం చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా సూచించారు. పూర్వీకులు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వంగా అందించారన్నారు. అందుకే ప్రతీ ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్య సంస్కారవంతులుగా తీర్చిదిద్దితే, యోగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గురువారం ఆయన ఆల్బెండజోల్ టాబ్లెట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీ వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యను అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలకు, ఆసుపత్రులకు ప్రజలే ఓనర్లన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ టాబ్లెట్లను అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడి సెంటర్ లలో అందిస్తున్నామన్నారు. 1వ సంవత్సరం నుండి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ టాబ్లెట్లను అందిస్తున్నామన్నారు. జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్ భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి, వైద్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Similar News