Health Minister: గాంధీ హాస్పిటల్‌లోనే పుట్టాను.. పేదల కష్టాలు నాకు తెలుసు

తాను గాంధీ హాస్పిటల్‌లోనే పుట్టానని, ఇక్కడికి వచ్చే పేదల కష్టాలన్నీ తనకు ప్రత్యక్షంగా తెలుసునని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు.

Update: 2024-09-03 12:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తాను గాంధీ హాస్పిటల్‌లోనే పుట్టానని, ఇక్కడికి వచ్చే పేదల కష్టాలన్నీ తనకు ప్రత్యక్షంగా తెలుసునని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి, కింగ్ కోఠి దవాఖాన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీతో పాటు వార్డులలో తిరుగుతూ వైద్యసేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చేది సాధారణ ప్రజలని, దొరలెవరూ ఇక్కడికి రారన్నారు. వీళ్లకు క్వాలిటీ వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. ఆఫీసర్లు, వైద్యాధికారులు, డాక్టర్లు, ఇతర స్టాఫ్​దీన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నారు. ‘దొరలకు రోగమొస్తే కార్పొరేట్ హాస్పిటళ్లకు పోతరు. మా వాళ్లే ఇక్కడికొస్తరు. వాళ్ల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత. గాంధీలో అన్ని వసతులు కల్పిస్తాం. ఇక్కడికొచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తాం’ అని మంత్రి వెల్లడించారు.

ఇక మారిన జీవన శైలీ, వాతావరణ పరిస్థితులు వలన సంతాన సౌఫల్య సమస్యలు పెరిగాయని, సామాన్యులకు ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే కేవలం వారం రోజుల్లో గాంధీలో ఐవీఎఫ్​సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. దీంతో పాటు మెడికోల హాస్టల్ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేస్తామన్నారు. పేషెంట్లతో మర్యాదగా వ్యవహరించాలని స్టాఫ్‌కు సూచించారు. పేషెంట్లకు అందించే ఆహారంలోనూ క్వాలిటీ ఉండాలన్నారు. అటెండర్లకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇరు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చారు. దీంతోపాటు గాంధీలో జీరియాట్రిక్ సేవలను కూడా ప్రారంభించాలన్నారు. దీంతో పాటు ఎమర్జన్సీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్ మెంట్లకు అదనపు యూనిట్లను ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీఎంఈ డాక్టర్ వాణి, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, ప్రొఫెసర్ కిరణ్​మాదాల తదితరులు పాల్గొన్నారు.


Similar News