అజారుద్దీన్‌కు కాంగ్రెస్ BIG షాక్.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయడం కష్టమే!
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు మొండిచెయ్యి చూపిందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు మొండిచెయ్యి చూపిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బరిలోకిదిగే అభ్యర్థుల మొదటి జాబితా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ అందులో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. అయితే ఉప్పల్ పీఎస్ పరిధిలో ఆయనపై నమోదైన కేసులు పార్టీకి మచ్చతెచ్చేలా ఉండడంతో అజారుద్దీన్‌కు మొండిచెయ్యి చూపినట్లుగా తెలిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. గతకొన్ని రోజులుగా నియోజకవర్గంలో పాదయాత్రలు చేస్తూ స్థానిక నాయకులు, ప్రజలను కలుస్తున్నారు.
అయితే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పని చేసిన 2019-2022 సమయంలో అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రి వంటి అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని హెచ్‌సీఏ అధికారులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు అక్రమాలను నిర్ధారించి అజారుద్దీన్ పై ఐపీసీ సెక్షన్లు 406, 409, 420, 465, 467, 471, 120(బీ) కింద కేసులు నమోదు చేశారు.
అజారుద్దీన్ ఆశలపై నీళ్లు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండడంతో అజారుద్దీన్ కూడా ఈ నియోజకవర్గంపై కన్నేశారు. గత కొన్ని నెలలుగా సెగ్మెంట్‌లో పాదయాత్రలు సైతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి, అజారుద్దీన్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకోగా ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తయారయ్యాయి.
నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలలు వర్గాలుగా విడిపోవడంతో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పని చేయాల్సి ఉండగా ఇద్దరు నేతలు దీనిని విస్మరించడంతో పార్టీ ఓడిపోయే ప్రమాదముందని కార్యకర్తలు వాపోతున్నారు.
పార్టీకి మరక అంటరాదని..?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అక్రమాలకు పాల్పడిన నేతకు టికెట్ ఇస్తే ఇది పార్టీ మొత్తం మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, ఇది రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుస్తుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పార్టీ అజారుద్దీన్‌కు టికెట్ ఇవ్వరాదనే నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో గతకొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న అజారుద్ధీన్ ఆశలపై నీళ్లుచల్లినట్లుగా పరిస్థితులు తారుమారయ్యాయి.
విష్ణువర్ధన్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనా..?
మాజీ ఎమ్మెల్యే విష్ణవర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో అజారుద్దీన్ పేరు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. ఒకదశలో అజారుద్దీన్‌కు టికెట్ ఖరారైందని, పీవీఆర్‌కు ఈ పర్యాయం టికెట్ లేనట్లేననే ప్రచారం జోరుగా సాగింది. అయితే అనూహ్యంగా అజారుద్ధీన్ పై ఉప్పల్ పీఎస్‌లో అవినీతి కేసులు నమోదు కావడంతో పరిస్థితులు మారిపోయాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకుడిగా ఉన్న పీ.విష్ణవర్ధన్‌రెడ్డికి టికెట్ ఇచ్చే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. అజారుద్దీన్ చేసుకున్న స్వయంకృత అపరాధాలు ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయనే చర్చలు కాంగ్రెస్ పార్టీలో జోరందుకున్నాయి.
Read More..
రాహుల్ ఎంట్రీతో రాష్ట్రంలో మారిన సీన్.. నేతల మదిలో ‘YSR యాత్ర’ స్మృతులు!