సచివాలయంపై గరుడ సంచారం.. శుభమా?.. అరిష్టమా?
కొత్త సెక్రటేరియట్‌పై ప్రతిరోజూ సాయంత్రం సమయంలో గద్దలెందుకు తిరుగుతున్నాయి. దీంతో అది శుభమా?.. అరిష్టమా? అన్న చర్చ కొందరు ఉద్యోగుల్లో మొదలవగా, వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల కారణంగానే అవి తిరుగుతున్నాయంటున్నారు ఇంకొందరు.
రాజసానికి అద్దంపట్టేలా నిర్మించిన సచివాలయాన్ని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. రాత్రి సమయంలో ఈ స్పాట్ సెల్ఫీలకు కేరాఫ్ గా మారింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అందులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి రోజు సెక్రటేరియట్ పైన గద్దలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాణ సమయంలో కనిపించని గద్దలు ప్రారంభోత్సవం తర్వాత నుంచి ప్రతి రోజూ ఇలా తిరగడంపై ఎంప్లాయీస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది అశుభమని కొందరు భావిస్తుంటే.. పాత ఆవాసం కోసం అవి చక్కర్లు కొడుతున్నాయంటూ మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంతకు ఇందులో దాగున్న వాస్తవమేంటి?
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియట్‌పై ప్రతిరోజూ సాయంత్రం సమయంలో గద్దలెందుకు తిరుగుతున్నాయి. దీంతో అది శుభమా?.. అరిష్టమా? అన్న చర్చ కొందరు ఉద్యోగుల్లో మొదలవగా, వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల కారణంగానే అవి తిరుగుతున్నాయంటున్నారు ఇంకొందరు. పాత ఆవాసాన్ని వెతుక్కునే క్రమంలోనే అవి చక్కర్లు కొడుతున్నాయంటున్నారు స్థానికులు. క్రమం తప్పకుండా ప్రతి రోజూ సాయంత్రం పూట మాత్రమే అవి ఎందుకు తిరుగుతున్నాయనే చర్చ సచివాలయ ఉద్యోగుల్లో మొదలైంది. కొత్త సచివాలయ భవనం గుమ్మటాలపైనే ఎక్కువ ఎత్తులో ఇవి గుంపులుగా తిరుగుతుండడాన్ని సాయంత్రం ఇంటికి వెళ్తున్న టైమ్‌లో గుర్తించిన ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. సచివాలయ నిర్మాణం పనులు జరిగే సమయంలో ఇవి ఎక్కువగా కనిపించలేదని, సాయంత్రంపూట అప్పుడప్పుడు మాత్రం కనిపించేవని అక్కడ పనిచేసిన కార్మికులు చెబుతున్నారు. సచివాలయం ప్రారంభం అయిన తర్వాత వాటిని నిత్యం గమనిస్తూ ఉన్నామని పరిసరాల్లో వ్యాపారం చేసుకుంటున్నవారు చెబుతున్నారు. గద్దలు ఇలా తిరగడం వల్ల రానున్న కాలంలో మంచి జరుగుతుందా?.. లేక ఊహించని పరిణామాలు ఏమైనా చోటుచేసుకుంటాయా?.. అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. ఒకరిద్దరు పూజార్లను కూడా కలిసి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
పాత ఆవాసంగా ‘సర్వహిత’ బ్లాక్
నిజాం కాలంలో ప్రధాని హోదాలో పాలనా వ్యవహారాలను నడపడానికి ప్యాలెస్ నిర్మాణమైంది. నిజాం నవాబు ఆ ప్యాలెస్ నుంచే పాలన సాగించారు. ఏపీ (ఉమ్మడి) ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రికి ఆ భవనం పాలనా కేంద్రంగానే పనిచేసింది. 1950వ దశకం మొదలు 1990వ దశకంలో ఎన్టీఆర్ వరకు సీఎం చాంబర్‌లు ఆ భవనంలోనే ఉండేవి. అడ్మినిస్ట్రేటివ్ కోణంలో ఆ భవనానికి అధికారులు జీ-బ్లాక్ అని పేరుపెట్టినా సీఎంగా ఎన్టీఆర్ ఆ భవనం నుంచి పాలన సాగించినప్పుడు దాన్ని ‘సర్వహిత’ అని పిలుచుకునేవారు. ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు వచ్చాక సీ-బ్లాక్ (సమత) నుంచి పాలన ప్రారంభించారు. వాస్తవానికి పాతకాలంనాటి బంగ్లా కావడం, రెండంతస్తుల భవనంలో ఎక్కువగా రంగూన్ టేకు చెక్కను ఇంటీరియర్ కోసం వాడడంతో ‘సర్వహిత’లో క్రమంగా సమస్యలు తలెత్తాయి. భవన నిర్మాణ నాణ్యతపై అధికారుల్లో అనుమానం రావడంతో దాన్ని వాడొద్దనే నిర్ణయం జరిగింది. దీంతో సీఎంగా చంద్రబాబునాయుడు సీ-బ్లాక్‌లో చాంబర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులంతా సమత బ్లాక్‌లోనే సీఎం చాంబర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఏ విభాగానికీ ‘సర్వహిత’ భవనాన్ని కేటాయించకుండా అధికారులు ఖాళీగానే వదిలేశారు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు వాడకపోవడంతో అది శిధిలావస్థకు చేరుకున్నది. పిచ్చిచెట్లు పెరిగి పాములు, కప్పలకు నిలయంగా మారింది. ఆ సమయంలోనే సాయంత్రం వేళల్లో గద్దలు, గబ్బిలాలు ఆ భవనాన్ని ఆవాసంగా మార్చుకున్నాయి. దీర్ఘకాలం పాటు ఇది కొనసాగింది.
కేసీఆర్ నిర్ణయంతో కూల్చివేత
పాత సచివాలయాన్ని కూల్చేసి కొత్తది నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో అక్కడి భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. సర్వహిత బ్లాక్‌ను కూడా అధికారులు కూల్చేశారు. దీంతో గద్దలకు ఆవాసం లేకుండాపోయింది. కొత్త భవనం ఉనికిలోకి రావడంతో సర్వహిత ఆనవాళ్ల అక్కడ లేకుండా పోయాయి. నిర్మాణం సమయంలో కనిపించని గద్దలు ప్రారంభోత్సవం తర్వాత నుంచే చక్కర్లు కొడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అవి వాటి పాత ఆవాసం కోసం వెతుక్కుంటున్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. నిర్మాణం సమయంలో ఏడాదిన్నరపాటు కనిపించని గద్దలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. కొత్త భవనం ప్రాంగణంలో పురుగు, పుట్ర లాంటివేమీ లేనప్పుడు ఆహార అవసరాలకు కోసం గద్దలు రావడానికి ఆస్కారమే లేదన్న అంశాన్నీ ఉద్యోగులు ప్రస్తావించారు.
పురాణాల ప్రకారం..
పురాణాల ప్రకారం గద్దలు కలలోకి రావడం లేదా మన చుట్టూ తిరగడాన్ని శుభసూచకంగానే చూస్తామని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు రాజ్యపాలనకు కేంద్రంగా ఉన్నందున అదే వర్తిస్తుందనే వాదన తెరపైకి వస్తున్నా... తగిన కారణం లేకుండానే గద్దలు తిరగడం రానున్న కాలంలో ప్రకృతి వైపరీత్యమో, ఊహకు అందని పరిణామాన్ని ఎదుర్కోవడమో జరగవచ్చన్న ఆందోళనను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలు, శిధిలావస్థకు చేరుకున్న పాత భవనాలు తదితరాలను స్థలపురాణం రీత్యా సహేతుకమైన కారణాన్ని చెప్పవచ్చని, అదే తీరులో ఇప్పుడు కొత్త సచివాలయానికి ఉన్న స్థలపురాణం రీత్యా ఆలోచించాల్సిన అంశమేననే అభిప్రాయాన్ని మరికొందరి వాదన. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కొత్త భవనం మీద పాత జీ-బ్లాక్ ఉండే (ప్రస్తుతం ముందువైపున్న గుమ్మటం స్థలం) ప్రాంతంపైన ఆకాశంలో సాయంత్రంపూట మాత్రమే గద్దలు తిరగడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఆహారం కోసం, ఆవాసం కోసం వెతుకులాటా?.. లేక ఇంకేదైనా కారణమా? అనేది ఆందోళనకు గురిచేస్తున్నది.
ఇవి కూడా చదవండి:
సీఎం ప్రయివేట్ సెక్రటరీ రిక్రూట్‌మెంట్ జీవో లీక్ చేసింది ఎవరు?