టీ కాంగ్రెస్‌కి హర్యానా ఓటమి దెబ్బ!

తెలంగాణ కాంగ్రెస్‌పై హర్యానా ఎన్నికల ఫలితాల ప్రభావం పడిందనే చర్చ మొదలైంది.

Update: 2024-10-09 02:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌పై హర్యానా ఎన్నికల ఫలితాల ప్రభావం పడిందనే చర్చ మొదలైంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమవుతుందని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ హర్యానాలో కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పు వస్తే, రాహుల్ గాంధీ వెంటనే తెలంగాణలో కేబినెల్ విస్తరణకు క్లియరెన్స్ ఇచ్చేవారని ఆశావాహులు చర్చించుకుంటున్నారు. కానీ ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఇప్పట్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై రాహుల్ దృష్టి పెట్టకపోవచ్చని టాక్ ఉంది.

నిరాశలో ఆశావాహులు:

హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని, వెంటనే కేబినెట్ విస్తరణ జరుగుతుందని డిస్కషన్ కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపించింది. దసరాలోపు లేకపోతే అక్టోబరు మూడోవారంలోపు విస్తరణ ముహుర్తం ఉంటుందని చర్చ కూడా జరిగింది. దీంతో మంత్రి పదవుల కోసం ఆశలు పెట్టుకున్న లీడర్లు తమ లాబియింగ్ ను మరింత తీవ్రం చేశారు. కానీ హర్యానా రిజల్ట్ చూసిన తరువాత ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉంటుందా? అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

కేబినెట్ విస్తరణకు వరసగా బ్రేకులు:

కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతున్నది. నిజానికి శ్రావణ మాసంలోనే ముహుర్తం ఫిక్స్ అయిందనే చర్చ జరిగింది. కానీ సామాజిక సమీకరణలు కుదరకపోవడంతో వాయిదా పడింది. బుజ్జగింపులు ప్రక్రియ పూర్తయ్యేలోపు రాహుల్ గాంధీ విదేశి పర్యటనకు వెళ్లారు. ఆయన సెప్టెంబరు రెండోవారంలో పర్యటన ముగించుకుని డిల్లీకి వచ్చారు. వెంటనే కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంతా అనుకున్నారు.. కానీ ఆయన మాత్రం హర్యానా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. దీంతో విస్తరణ మళ్లీ వాయిదా పడింది. హర్యానాలో భిన్నమైన ఫలితాలు రావడంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయనే టాక్ ఉంది.


Similar News