కేంద్ర మంత్రులతో హరీశ్‌రావు భేటీ..

Update: 2023-07-11 16:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళిన ఆయన ఐజీఎస్టీ నిధుల విడుదలలో జరుగుతున్న పొరపాట్లను సవరించి తెలంగాణకు రావాల్సిన వాటాను వెంటనే అందించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో విడిగా భేటీ అయ్యి విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతీ సంవత్సరం రూ. 450 కోట్ల మేర వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని కోరారు. మొత్తం నాలుగేండ్ల నిధులు రావాల్సి ఉన్నదన్నారు. ఈ నిధులు అందని కారణంగా ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా కలుపుకుని మొత్తం ఐదేండ్ల ఫండ్స్ ను రిలీజ్ చేయాలని కోరారు.

కాళేశ్వరం థర్డ్ టీఎంసీకి అనుమతులివ్వండి..

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయిన మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రానికి సంబంధించిన పలు సాగునీటి అవసరాలు, ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతులపై చర్చించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అనుమతిలేని ప్రాజెక్టులను వెంటనే ఆపేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో థర్డ్ టీఎంసీని లిఫ్ట్ చేయడానికి అవసరమైన అనుమతులను ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే డీపీఆర్‌ను కూడా సమర్పించినట్లు గుర్తుచేశారు. దీనితో పాటు సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, డాక్టర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం నుంచి రావాల్సిన క్లియరెన్సులను వీలైనంత తొందరగా ఇప్పించాలని రిక్వెస్టు చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 2020 అక్టోబరులోనే వీటి గురించి చర్చించినట్లు గుర్తుచేశారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు జీవధార అని కేంద్ర మంత్రికి వివరించిన హరీశ్‌రావు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు కేంద్ర జల సంఘం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 12.36 లక్షల ఎకరాలకు సాగునీరు మాత్రమే కాకుండా ఫ్లోరైడ్ సమస్యలతో బాధపడుతున్న 1,226 గ్రామాలకు త్రాగునీరు ఇవ్వడానికి వీలు పడుతుందని, ఆరు జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని, సమగ్ర ప్రాజెక్టు నివేదికను గతేడాది సెప్టెంబరులోనే సమర్పించామని, కేంద్ర మంత్రిగా వీటిపై చొరవ తీసుకుని సత్వరం అన్ని క్లియరెన్సులు మంజూరు చేయించాలని కోరారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో వాటాలను ఫిక్స్ చేయాలని, అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, కృష్ణా బోర్డుకు ఇప్పటికే వివరించామని కేంధ్ర మంత్రికి తెలిపారు.

అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం గతంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని, కానీ అపెక్స్ కౌన్సిల్‌లో ఇచ్చిన హామీ మేరకు దాన్ని ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రికి వివరించిన హరీశ్‌రావు... న్యాయమైన నీటి వాటాపై ట్రిబ్యునల్‌కు బాధ్యతలు అప్పగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన గెజిట్ ప్రకారం ట్రిబ్యునల్ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు ఉన్నందున తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వమే ట్రిబ్యునల్‌కు అప్పజెప్పాలని కోరారు. ట్రిబ్యునల్‌కు ఆ అధికారం లేకపోయినా సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న విషయాన్ని తెలియజేసి అదనపు అధికారాన్ని కల్పించాలని కోరారు.

గత నెల చివరివారంలో ఢిల్లీకి వెళ్ళిన మంత్రి కేటీఆర్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ టూర్‌లో ఇద్దరు మంత్రులను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పు-నిప్పు వాతావరణం నెలకొన్నది. కేంద్రంతో అవసరమే లేదన్న తీరులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. గత కొన్ని నెలలుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య సంబంధాల్లో తేడా వచ్చిందని, ఫ్రెండ్లీ పార్టీలుగా మసులుకుంటున్నాయన్న వార్తలకు బలం చేకూరే విధంగా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమావేశాలు జరుగుతుండడం గమనార్హం.


Similar News