గ్రూప్-1పై గందరగోళం.. ఆందోళనలో అభ్యర్థులు

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Update: 2024-10-21 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను కల్పిస్తూ బీఎన్ఎస్ చట్టం, సెక్షన్ 163, ఐపీసీ సెక్షన్ 144 అమలు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడకుంటా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పరీక్ష 2 గంటలకు జరుగుతున్నప్పటికీ 1:30 తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించడం జరగదని హెచ్చరించారు. బయోమెట్రిక్, సర్టిఫికేట్ల పరిశీలన చేయాల్సి ఉన్నందున అరంగంట ముందే గేట్లు మూసేయడం జరుగుతుందని, అభ్యర్థులంతా సాధ్యమైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు.

అనంతరం పరీక్ష విధానం గురించి వివరిస్తూ.. అభ్యర్థులు వారికి ఇచ్చిన బుక్‌లెట్‌లోనే జవాబులు రాయాలని, అదనంగా ఎలాంటి అడిషనల్ షీట్స్ ఇవ్వరని చెప్పారు. అలాగే ఇప్పటికే అభ్యర్థులకు హాల్‌టికెట్లు అందించడం జరిగిందని, పరీక్షలన్నీ పూర్తయ్యే వరకు అదే హాల్‌టికెట్‌ ఉంటుందని, పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు పెన్ను, పెన్సిల్, ఎరేజర్ మాత్రమే తీసుకురావాలని.. డిజిటల్ వాచ్‌లు, మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్ వంటి డిజిటల్ పరికరాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని అధికారులు హెచ్చరించారు.

కాగా.. ఒకపక్క శరవేగంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఏర్పాట్లు జరుగుతుంటే మరోపక్క ఈ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొంతమంది అభ్యర్థులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు (సోమవారం) విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ని పరిశీలించి.. కేసును మరో బెంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనుకున్న టైంకి పరీక్ష జరుగుతుందా..? లేదా..? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు గ్రూప్-1 పరీక్షలు రద్దైన నేపథ్యంలో ఈ దఫా కూడా పరీక్ష వాయిదా పడినా, రద్దయినా తమ పరిస్థితి ఏంటంటూ కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News