సివిల్ సప్లై లో ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్.. 160 మందికి పదోన్నతులు

రాష్టంలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న 160 మంది ఉద్యోగులకు పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు బుధవారం ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ను ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2024-08-14 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న 160 మంది ఉద్యోగులకు పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు బుధవారం ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ను ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ చౌహన్ మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో పరిపాలన సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందని అన్నారు. ఉద్యోగులు గత కొన్నేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. ఉద్యోగులకు పదోన్నతికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.పౌరా సరఫరాల శాఖలో పదోన్నతులు లేకపోవడం వల్ల చాలా కాలంగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఈ పదోన్నతులతో ఆ భారం తీరనుంది. అలాగే పదోన్నతుల కారణంగా ఏర్పడిన ఖాళీలను ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్టు కమిషనర్ తెలిపారు. ధాన్యం సేకరణ, ఫైనాన్స్, మార్కెటింగ్, అకౌంటింగ్ వాటి విభాగాల్లో చాలా కాలంగా ఉద్యోగుల కొరత ఉండేది.

పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణ, వినియోగదారులకు బియ్యం పంపిణీ చేయడం కేంద్ర ప్రభుత్వం నుంచి ద్వారా కార్పొరేషన్ కు సంవత్సరానికి సుమారు రూ. 320 కోట్లు ఆదాయం లభిస్తుంది. కార్పొరేషన్ సిబ్బంది జీతాల కోసం ఏడాదికి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేస్తోంది. వరి ధాన్యం కొనుగోళ్లలో నాణ్యతపై స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు మార్లు ఆందోళన వ్యక్తం చేశారు. 98 క్వాలిటీ వెరిఫికేషన్ సిబ్బందికి మంజూరైన పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఈ శాఖ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం 43 మంది ఔట్‌సోర్సింగ్, 45 మంది రిటైర్డ్ క్వాలిటీ సిబ్బంది ఉండగా వారిలో 10 మంది మాత్రమే పర్మినెంట్‌గా ఉన్నారు. 2011లోకాంగ్రెస్ హయాంలో చివరిసారిగా రిక్రూట్‌మెంట్ జరిగింది. ప్రస్తుతం 80 శాతం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఉద్యోగులకు పదోన్నతి కోసం చొరవ చూపిన కమిషనర్ చౌహన్ కు ఉద్యోగులు అభినందనలు తెలిపారు.


Similar News