కేటీఆర్ మిత్రుడికి షాక్.. అక్కడ కాంగ్రెస్ హవా..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార భారత్ రాష్ట్ర సమితి

Update: 2023-10-31 02:29 GMT

దిశ, పొలిటికల్ బ్యూరో: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిత్రుడు గట్టి దెబ్బ తింటున్నారా..! సీనియర్ రాజకీయ అనుభవం ఉన్న నేతగా పేరు ఉన్న బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కు మరోసారి పరాభవం తప్పదా..? అంటే అవునన్న సమాధానమే ఖానాపూర్ నియోజకవర్గంలో కనిపిస్తున్నది. ఆ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న ఓటరు నాడి పరిశీలిస్తే తామెంతో బలమైన అభ్యర్థులమన్న ప్రచారంలో ఉన్న అధికార గులాబీ పార్టీ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్, బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ లకు... ఆదివాసి సమూహం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గోండు సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ వెడ్మా బొజ్జు చుక్కలు చూపిస్తున్నారన్న ప్రచారం మొదలైంది. సొంత సామాజిక వర్గానికి చెందిన ప్రజలతోపాటు గిరిజనేతర సామాజిక వర్గాలు సైతం ఆయనకు మద్దతు ఇస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఖానాపూర్లో... ఆ సామాజిక వర్గం వద్దంటూ...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు జిల్లాలతో ముడిపడి ఉన్న ఖానాపూర్ నియోజకవర్గం రాజకీయ పరంగాను అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరు ఉంది. మాజీ మంత్రి కోట్నాక్ భీమ్రావు, సీనియర్ శాసనసభ్యులు గోవింద్ నాయక్, జాదవ్ అంబాజీ, సహా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తదితరులకు నేతలందరికీ ఈ నియోజకవర్గ అవకాశం ఇచ్చింది. అయితే మారుతున్న రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల స్వలాభ రాజకీయపేక్ష వంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో గిరిజన సామాజిక వర్గం రెండు వర్గాలుగా నిట్ట నిలువుగా చీలిపోయింది. ప్రధానంగా ఆదిమ గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు అయిన ఐటీడీఏ కేంద్రం ఉన్న ఉట్నూరు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది అనేక ఆదివాసి ఉద్యమాలకు కేంద్రబింబం అయిన ఉట్నూరు సహా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇంద్రవెల్లి సిరికొండ జన్నారం కడం ఖానాపూర్ పెంబి తదితర మండలాల్లో విస్తరించి ఉన్న ఆదిమ గిరిజన గూడాలు ఈ ఎన్నికల్లో తమ అస్తిత్వం కోసం కట్టుబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెడ్మ బొజ్జు కు ఆయన తెగకు చెందిన గోండు లతో సహా ఆదిమ గిరిజన తెగలైన నాయక్ పోడ్, అంద్, పర్దాన్, కొలాం, తోటి, కోయ తదితర ఆదిమ గిరిజన జాతులందరూ అండగా నిలవాలని తీర్మానం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితులను బట్టి ఖానాపూర్ నియోజకవర్గంలో లంబాడా సామాజిక వర్గం కాకుండా తమ సామాజిక వర్గానికి చెందిన ఆదిమ గిరిజనుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమ ఆదిమ గిరిజనుడు కాకుండా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలోపేతం అయిన లంబాడ సామాజిక వర్గాన్ని ఓటు ద్వారా తమ వ్యతిరేక భావాన్ని ఈ ఎన్నికలతో పాటు జాతీయస్థాయిలో చూపాలన్న అభిప్రాయంతో ఆదిమ గిరిజన సంఘాలన్నీ ఏకమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి దీని వెనుక తుడుం దెబ్బ సహా ఆదిమ గిరిజన సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న సుమారు 15 సంఘాలు ఏకమైనట్లు కూడా ప్రచారం ఉంది.

బీజేపీ , బీఆర్ఎస్ అభ్యర్థులు నాన్ లోకల్...

ఖానాపూర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బిజెపి బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు కూడా నాన్ లోకల్ అన్న ప్రచారం ఉంది బిజెపి నుంచి పోటీలో ఉన్న మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత. ఆయన సొంత మండలం ప్రస్తుతం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉంది. గతంలో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాథోడ్ రమేష్ ను ఖానాపూర్ సొంత నియోజకవర్గ అభ్యర్థిగా ఈ ప్రాంత ప్రజలు భావించడం లేదు. మరోవైపు అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీ నుంచి బరిలో దిగిన భూక్య జాన్సన్ నాయక్ ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలోని జగిత్యాల జిల్లా వాసి. ఈ ప్రాంతంతో ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. కేవలం రాజకీయ, అధికారకాంక్షతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిత్రుడిగా ఖానాపూర్ నుంచి పోటీ చేయడానికి ఈ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందరు మంది సీనియర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ అధికార బలంతో కేటీఆర్ తన మిత్రుడిని ఇక్కడ పోటీలో దించడానికి అధికార పార్టీకి చెందిన సొంత నేతలు కార్యకర్తలు, సైతం తప్పుపడుతున్నారు. ప్రచారంలో పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ వెంట తిరుగుతున్న నేతలు కార్యకర్తలు సైతం జాన్సన్ నాయక్ అభ్యర్థిత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమాచారం అధిష్టానానికి కూడా చేరిందని చెబుతున్నారు దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్... జాన్సన్ నాయక్ ను ఓడించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు బీఎస్పీ సైతం లంబాడ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించింది.

బలపడుతున్న బొజ్జు

ఆదిమ గిరిజన తెగలకు చెందిన యువకుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వెడ్మ బొజ్జు ఖానాపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థిగా రోజురోజుకు బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి లంబాడ ఓట్లతో పోలిస్తే నాలుగింతల బలం ఆదివాసి సమూహానికి ఉంది వీరంతా ఏకపక్షంగా లంబాడా అభ్యర్థులను వ్యతిరేకిస్తే ఆయనకు పూర్తిస్థాయిలో బలం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు మరోవైపు గిరిజనేతర ఓటర్లు సైతం బొజ్జుకు అనుకూలత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు క్రిస్టియన్ ఓటర్లు ఎస్సీ కమ్యూనిటీ ఓటర్లు అధికార భారత్ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీలను గట్టిగా వ్యతిరేకిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి బొజ్జు క్రమంగా బలపడుతున్న పరిస్థితులు ఈ నియోజకవర్గంలో నెలకొన్నాయి. తాజా పరిణామాలు అటు బిఆర్ఎస్ ఇటు బిజెపి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి


Similar News