RTC విలీనం బిల్లుకు మరికొన్ని గంటల్లో గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్టీసీ ఉద్యోగుల విలీనం డ్రాఫ్టు బిల్లుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్టీసీ ఉద్యోగుల విలీనం డ్రాఫ్టు బిల్లుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డ్రాఫ్టులో పొందుపరిచిన పలు అంశాలపై లేవనెత్తిన సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్లై వెళ్ళింది. దీనిని పరిశీలించడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంఘాల ప్రతినిధులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు.
ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమైన తర్వాత వారి జీతభత్యాలు, పింఛను, సంక్షేమం తదితరాల గురించి ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులు సైతం సంతృప్తి వ్యక్తం చేయడంతో అసెంబ్లీలో చర్చకు వీలుగా డ్రాఫ్టు బిల్లుకు అనుమతి ఇవ్వనున్నట్లు మౌఖికంగా సానుకూలంగా స్పందించినట్లు ఆ ప్రతినిధులు వివరించారు.
సాయంత్రానికి పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ చేరుకుని ఆ డ్రాఫ్టు బిల్లును స్టడీ చేసి అనంతరం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు ప్రతినిధుల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ఆదివారం కూడా జరగనున్నందున బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చల అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందే తీరులో శనివారం రాత్రికే గవర్నర్ అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకునే డ్రాఫ్టు బిల్లుపై మరికొన్ని గంటల్లో ప్రతిష్ఠంభన తొలగిపోయే అవకాశమున్నది.
ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన చర్చల సందర్భంగా సిబ్బంది భవిష్యత్తు గురించే ఆమె ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసినట్లు సంఘం నేత థామస్ రెడ్డి మీడియాకు వివరించారు. గతంలో సమ్మె చేసిన సందర్భంగా సంపూర్ణ మద్దతు తెలియజేసిన అంశాన్ని కూడా ఆమె ఆ కాన్ఫరెన్సు సందర్భంగా గుర్తుచేసినట్లు తెలిపారు. చర్చల అనంతరం ఆమె సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం కలిగిందని థామస్ రెడ్డి పేర్కొన్నారు.