జీతాలకంటే అప్పుల చెల్లింపులకే ఎక్కువ.. ప్రభుత్వానికి పెద్ద సవాల్‌

ప్రభుత్వానికి ఈ నెల జీతాల కంటే తీసుకున్న అప్పుల చెల్లింపుకే ఎక్కువగా ఖర్చు అవుతోంది.

Update: 2024-09-21 01:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో తీసుకున్న అప్పులను తీర్చడం ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ నెల జీతాల కంటే తీసుకున్న అప్పులకు కిస్తీలను చెల్లించేందుకు ఎక్కువగా ఖర్చు చేశారు. దీంతో అప్పులను తీర్చేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల జీతాలు, పెన్షన్ల కోసం సుమారు రూ.4,800 కోట్లు ఖర్చు చేయగా, కిస్తీలకు సుమారు రూ.5,300 కోట్లు చెల్లించినట్టు తెలిసింది. రానున్న రోజుల్లో అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాత లోన్లను రీ షెడ్యూలు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

కిస్తీల భారం రూ.70 వేల కోట్లు

గతంలో తీసుకున్న వాయిదాల భారం తక్కువగా, జీతాల భారం ఎక్కువగా ఉండేది. కానీ.. ఈ నెల నుంచి సీన్ రివర్స్ కానుందని అధికారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పైసా ఖర్చు చేయకున్నా, ప్రతినెలా జీతాలు, అప్పుల చెల్లింపు కోసం రూ.10 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ కార్పొరేషన్ల పేరుతో విచ్చిలవిడిగా అప్పులు చేయడమే పెద్ద సమస్యగా మారిందని విమర్శలు ఉన్నాయి. సెప్టెంబరు 3 నుంచి 20 మధ్య ఆర్బీఐ నుంచి ప్రభుత్వం రూ.4,500 కోట్ల అప్పు చేసింది.

ఇందులో దాదాపు 90 శాతం నిధులు పాత అప్పులకు కిస్తీలు చెల్లింపు కోసమే ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించేందుకు సుమారు రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు లెక్కలు తీసినట్టు తెలిసింది. అప్పుల చెల్లింపు పెద్ద సమస్యగా మారడంతో, పాత అప్పులను రీ షెడ్యూలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతో వాయిదాల సంఖ్య పెరగడం వల్ల, ప్రతినెలా చెల్లించే కిస్తీల భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Similar News