ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంది : మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్).. భారత ప్రైవేటు ఉద్యోగుల సంఘంగా ఏర్పడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్).. భారత ప్రైవేటు ఉద్యోగుల సంఘంగా ఏర్పడిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన కారణంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన టీపీయూఎస్ 2023 డైరీని అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశంలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు.
ఉద్యోగార్థులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారికి అత్యధిక కనీస వేతనాలు అందిస్తూ, పీఎఫ్,ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత వంటి అనేక వసతులు కల్పించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వమే ముందంజలో ఉందన్నారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ప్రభుత్వం వేస్తున్న నోటిఫికేషన్లు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని, ప్రభుత్వం అందించే స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, సంఘం జాతీయ అధ్యక్షుడు గంధం రాములు, కార్యదర్శి మోహన్ నాయక్, సభ్యులు వెల్పుకొండ వెంకటేష్, విజయ్ రావు, స్వర్ణక్క తదితరులు పాల్గొన్నారు.