రైతులకు గుడ్ న్యూస్.. వడ్ల కొనుగోలుకు లైన్ క్లియర్!

దిశ, తెలంగాణ బ్యూరో: వరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతున్నది. ఇబ్బంది లేకుండా

Update: 2022-03-27 02:00 GMT

వడ్ల కొనుగోళ్లపై సందిగ్ధత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయమై మాటల యుద్ధం సైతం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టి, రైతుల వద్ద క్రెడిట్ కొట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది. అందులో భాగంగానే వరి సాగు చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పబోతున్నది. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా ధాన్యం కొనుగోలును చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: వరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతున్నది. ఇబ్బంది లేకుండా వడ్లను అమ్ముకునేందుకు మార్గాన్ని చూపించనున్నది. ప్రాథమిక స్థాయిలో కసరత్తు కూడా పూర్తయింది. త్వరలోనే కొలిక్కి రానున్నది. పండగ తర్వాత కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకానున్నది. రాష్ట్ర ప్రభుత్వమే మిల్లర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సమాచారం. రైస్ మిల్లర్లతో మాట్లాడి ఎక్కడికక్కడ కొనుగోళ్లు జరిగేలా మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయినట్టు సమాచారం.

ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల ద్వారానే ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా సీఎం వ్యూహాన్ని సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన కనీస మద్దతు ధరకే ధాన్య సేకరణ పూర్తి కానున్నది. గతేడాది వానాకాలంలో తలెత్తిన ఇబ్బందులు ఈసారి పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునే తీరులో వ్యవహరించాలని అనుకుంటున్నది. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి రాష్ట్రానికి వెసులుబాటు లభిస్తుంది. ఒకవైపు కేంద్రంపై యుద్ధం చేస్తూనే మరోవైపు రైతులపై ఆ ప్రభావం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అవలంబించాలని అనుకుంటున్నది. తెలంగాణలో పండిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనాలంటూ ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ ఇటీవల లేఖ రాశారు. రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి వివరించారు. కానీ కేంద్రం నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన రాలేదు. రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలుచేసిన టీఆర్ఎస్ ఇప్పుడు కొనుగోళ్లకు మార్గం చూపించడం ద్వారా రైతుల మనస్సులను గెల్చుకోవాలని భావిస్తున్నది. ఈ చర్యల ద్వారా రాష్ట్ర బీజేపీ నేతలను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎండగట్టడానికి గులాబీ పార్టీకి అస్త్రం దొరికినట్లవుతుంది.

కేంద్ర ప్రభుత్వ రిప్లై కోసం ఎదురుచూపు

వరి సాగు వద్దని చెప్పినా రైతులు సుమారు 36 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో దాదాపు పది లక్షల ఎకరాల్లో విత్తన సంస్థలు, రైస్ మిల్లర్లతో ముందుగానే అవగాహన కుదుర్చుకుని సాగు చేసినట్టు ప్రభుత్వం లెక్కలు వేసింది. మిగిలిన పాతిక లక్షల ఎకరాల నుంచి దాదాపు 50 లక్షల టన్నుల వరకు వడ్లు రావొచ్చని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వమూ నేరుగా కొనుగోలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు వడ్లు అమ్ముకోడానికి ప్రైవేటు బయ్యర్లు, రైస్ మిల్లర్లను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. రైతులకు నష్టం కలగకుండా, కనీస మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఉగాది పండుగ వరకూ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూద్దామనే ధోరణలో సీఎం ఉన్నారు. మంత్రులతో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు.

సానుకూల స్పందన రాకుంటే..

ఒక వేళ అప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే రాష్ట్రమే చొరవ తీసుకుని మిల్లర్ల ద్వారా ప్రత్యామ్నాయాన్ని చూపించి రైతులకు బాధలు లేకుండా చేయాలనుకుంటున్నది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బీజేపీని రైతుల్లో బద్నాం చేయడానికి టీఆర్ఎస్‌కు వీలు చిక్కుతుంది. ప్రైవేటు మిల్లర్లు సేకరించిన ఈ ధాన్యాన్ని పక్క రాష్ట్రాల్లో అమ్ముకోడానికి ఎలాంటి చిక్కులూ ఉండవు. కొద్దిమంది రైస్ మిల్లర్లకు విదేశాలకు ఎగుమతి చేయడానికి లైసెన్సు కూడా ఉన్నాయి. దీంతో కాకినాడ పోర్టు ద్వారా రవాణా చేయడానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది.

ఎవరూ నష్టపోకుండా..

వీలైనంత వరకు మిల్లర్లు కూడా నష్టపోకుండా బాయిల్డ్ రైస్‌నే విక్రయించుకోడానికి మొగ్గుచూపే చాన్స్ ఉంది. ఒకవేళ పచ్చి బియ్యాన్నే అమ్ముకోవాల్సి వస్తే నూకలకు సైతం తగిన మార్కెట్ ఉందనే అభిప్రాయాన్ని మిల్లర్లు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇటు రైతులకు, అటు మిల్లర్లకు నష్టం లేకుండా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నది. యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ప్రక్రియ తర్వాత మరోసారి మిల్లర్లతో, ప్రైవేటు వ్యాపారులతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపి కొనుగోళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై చర్చించే చాన్స్ ఉంది.

Tags:    

Similar News