Good News: నిరుపేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల డిజైన్ రెడీ!
ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను అందజేస్తామని వెల్లడించారు. దీంతో అధికారులు ఇండ్లకు సంబంధించి డిజైన్ పై కసరత్తు స్పీడప్ చేశారు. వరుస సమావేశాలు నిర్వహించి.. ఇప్పటికే నాలుగైదు రకాల డిజైన్లు రెడీ చేసినట్టు తెలిసింది. సదరు డిజైనర్లపై హౌజింగ్ శాఖ మంత్రి సమీక్షించి, ముఖ్యమంత్రికి నివేదించి.. అప్రూవల్ పొందిన తర్వాతే ఫైనల్ చేయనున్నట్లు తెలిసింది. ఈఅంశంపై త్వరలోనే హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి సమీక్షించనున్నట్లు సమాచారం.
పాత డిజైన్లకు సమీపంలో..
ఇందిరమ్మ ఇండ్ల పాత డిజైన్లకు సమీపంలోనే కొత్త డిజైన్ ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి నిర్మాణంలో ‘కాంగ్రెస్ రికగ్రైజేషన్’ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. డిజైన్లు రూపొందించే ముందు ఈ అంశాన్ని గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. అయితే పాత డిజైన్ నుంచి లోగో, కలర్లను స్వీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం సహకారంతో ఇండ్లు నిర్మిస్తే తాము రూపొందించిన లోగోను ఇండ్లపై తప్పనిసరిగా ఉండాలని కేంద్రం షరతు విధించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం ప్రభుత్వం లోగోను ప్రభుత్వం తయారు చేయిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోగోలను ముద్రించాలా అన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల స్కీమ్స్‌పై స్టడీ!
వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధికారులు స్టడీ చేస్తున్నట్టు తెలిసింది. అక్కడికి నేరుగా వెళ్లకుండా ప్రాథమికంగా ఇక్కడి నుంచే అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయమై అధికారులకు హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవటం ద్వారా తెలంగాణలో పథకాన్ని పకడ్బందీగా అమలు అవకాశముంటుందని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో అధికారులు ఎప్పుడు పర్యటిస్తారన్న దానిపై క్లారిటీ లేదు.
నిధుల సమీకరణ సవాలే
ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఒక్కో ఇంటికి దశలవారీగా రూ. 5లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. అయితే, ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో 80 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అందులో నుంచి అనర్హులను తొలగించి, అర్హులతో జాబితా తయారుచేసిన తరువాత ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నట్టు సమాచారం. అందుకు కావాల్సిన నిధుల సమీకరణ కూడా ప్రభుత్వ ఒక సవాలే కానుంది. మరోవైపు, 4.5 లక్షల మందికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసేందుకు రూ. 22,500 కోట్లు అవసరం కానున్నాయి. అయితే, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 7,740 కోట్లు మాత్రమే కేటాయించారు. రిలైజ్డ్ ఎస్టిమేషన్స్ లో పెంచుతారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొన్నది. ఇక హౌజింగ్ శాఖ హడ్కో నుంచి రూ. మూడు వేల కోట్లు సేకరించాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి రూ. 1.5 లక్షల చొప్పున నిధులు అందే అవకాశముంది. అయినప్పటికీ మరో రూ. 5,000 కోట్ల వరకూ లోటు ఏర్పడనుంది. దీనిపై ఎలా ముందుకు వెళతుందన్నది తేలాల్సి ఉన్నది.