మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి జీవో విడుదల..
అలంపూర్ నియోజకవర్గ రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అలంపూర్ నియోజకవర్గ రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కు అందజేశారు.
మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడంతో పాటు 783 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే అబ్రహం అలంపూర్ రైతాంగం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంలో తమ నియోజకవర్గంలో తొమ్మిది చెక్ డ్యాంల నిర్మాణానికి 77 కోట్ల రూపాయలను కేటాయించిన సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
మే రెండో వారం తర్వాతే సీఎం పర్యటన..
మే రెండవ వారం తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారంలో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాలు, తదితర కార్యక్రమాలకు ముఖ్య మంత్రి కేసీఆర్ హాజరు అవుతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. మే నెల 5వ తేదీన సీఎం ఢిల్లీ పర్యటనకు వెళుతున్న రెండవ వారం తర్వాతనే నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దిశ కు తెలిపారు.