గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకూ కీలక బాధ్యతలు

తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.

Update: 2024-08-22 15:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ పరిశ్రమలో ‘నంది’ స్థానంలో ‘గద్దర్’ పేరుతో అవార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీకి చైర్మన్‌గా సినీ దర్శకుడు బి.నర్సింగరావును, వైస్ చైర్మన్‌గా నిర్మాత దిల్ రాజును నియమించింది. గద్దర్ పేరుతో సినీ ప్రముఖులకు అవార్డులు ఇవ్వడానికి అనుసరించాల్సిన విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగో రూపకల్పన తదితరాలకు సంబంధించి ఈ కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. దర్శకుడు కే.రాఘవేంద్రరావు, కవి అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత దగ్గుబాటి సురేశ్, పాటల రచయితల సుభాష్ చంద్రబోస్, నిర్మాత ఆర్ నారాయణమూర్తి, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్‌శంకర్, బలగం వేణు ఈ కమిటీ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. పాటు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. గద్దర్ పేరుతో అవార్డుల విధానానికి సంబంధించి ఎఫ్‌డీసీతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గద్దర్ పేరుతో సినీ అవార్డులను ఇవ్వడానికి సంబంధించి గతంలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కమిటీను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. 


Similar News