G- 20 కల్చరల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ కంప్లీట్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వారణాసిలో నిర్వహించిన జీ 20 కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు పూర్తయినట్లుగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. వారణాసిలో జరిగిన జీ 20

Update: 2023-08-25 14:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వారణాసిలో నిర్వహించిన జీ 20 కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు పూర్తయినట్లుగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. వారణాసిలో జరిగిన జీ 20 సమావేశాలకు హాజరైన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. శనివారం జీ 20 సాంస్కృతిక శాఖ సమావేశాలు జరుగుతాయని, శనివారంతో ఇవి కూడా ముగుస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మీటింగ్‌కు సభ్యదేశాలతో పాటు 8 ఆహ్వానిత దేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, 6 అంతర్జాతీయ సంస్థల సభ్యులతో భేటీ అవుతున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంతోపాటు వివిధ అంశాలపై చర్చించేందుకు, ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన ప్రభావం తీసుకొచ్చేందుకు కావాల్సిన పరిష్కారాలపై చర్చించేందుకు ఒక చక్కటి వేదికగా నిలవనుందని ఆయన చెప్పారు.

ఫిబ్రవరిలో ఖజురహోలో భారత్‌లో మొదటి కల్చరల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రెండో కల్చరల్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మే నెలలో భువనేశ్వర్‌లో.. మూడోది జూలై నెలలో కర్ణాటకలోని హంపిలో జరిగిందన్నారు. ఇది నాలుగో, చివరి వర్కింగ్ గ్రూప్ సమావేశమని కిషన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం వారణాసిలో కల్చరల్ డిక్లరేషన్ ఉంటుందని, శనివారం సమావేశంలో ఆమోదించనున్నట్లు స్పష్టంచేశారు. దీనికి సంబంధించి భారత సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వివిధ వెబినార్లను నిర్వహించామని, ఈ వెబినార్లలో జీ20 దేశాలతోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు, భాగస్వామ్య పక్షాల నుంచి 159 మంది సభ్యులు పాల్గొన్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.

ఇదిలా ఉండగా వారణాసిలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ-2023’ లో భాగంగా యువ టూరిజం క్లబ్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో యువ టూరిజం క్లబ్‌ల విషయంలో విశేషమైన కృషి జరుగుతోందన్నారు. విద్యతోపాటుగా పాఠ్యేతర అంశాల్లోనూ విద్యార్థులు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని సూచించారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం 1 శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సేవా తత్పరత పెంచే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం.. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించిందన్నారు.

Tags:    

Similar News