కాంగ్రెస్ టికెట్లకు ఫుల్ డిమాండ్.. అత్యధింగా ఆ నియోజకవర్గం నుండి 36 మంది ఆశావాహులు..!
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కర్ణాటక తర్వాత పార్టీలో వేవ్ మొదలు కావడంతో టిక్కెట్ల కోసం కాంపిటేషన్ పెరిగింది. 119 నియోజకవర్గాలకు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కర్ణాటక తర్వాత పార్టీలో వేవ్ మొదలు కావడంతో టిక్కెట్ల కోసం కాంపిటేషన్ పెరిగింది. 119 నియోజకవర్గాలకు సుమారు వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అంటే ఒక్కో సెగ్మెంట్‌కు సగటున 8 మంది చొప్పున పోటీలో ఉన్నారు. అత్యధికంగా ఇల్లెందు నుంచి అప్లికేషన్లు వచ్చినట్లు తెలిసింది. ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి ఏకంగా 36 మంది అశావహులు పోటీలో నిలబడటం గమనార్హం. ఇక శుక్రవారం దరఖాస్తుకు చివరి రోజు కావడంతో కీలక నాయకులంతా గాంధీభవన్‌కు క్యూ కట్టారు. కుటుంబ సభ్యులతో కలసి టిక్కెట్ కొరకు దరఖాస్తు చేశారు. లీడర్లు, కార్యకర్తలంతా ఒకే సారి పార్టీ కార్యాలయానికి రావడంతో సందడి వాతావరణం ఏర్పడింది.
పార్టీకి సంబంధం లేనోళ్లు కూడా...?
కాంగ్రెస్ పార్టీలో చేరనోళ్లు.. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. వివిధ జిల్లాల్లో ప్రజలను ప్రభావితం చేయగల కీలక నేతలు, గతంలో పోటీ చేసిన వాళ్లు, ఆశావాహులు, పలువురు పారిశ్రామికవేత్తలు, సోషల్ వర్కర్లు, కుల సంఘాల నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇలాంటి అప్లికేషన్లను కూడా ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఎంపిక చేస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకే కుటుంబంలో.. ఒకటి కంటే ఎక్కువ చోట్ల..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నుంచి దరఖాస్తు చేసుకున్నారు. మూడు నియోజకవర్గాలను పార్టీ పూర్తి స్థాయిలో పరిశీలించి ఒకఅసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టిక్కెట్‌ను కేటాయించనున్నది. ఇక ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్ నుండి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్ రావులు అప్లై చేశారు. నాగార్జునసాగర్ నుండి జానా ఇద్దరు కుమారుల పోటీకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.
దీనిలో భాగంగానే ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డిలు అప్లై చేశారు. దీంతో పాటు పెద్ద కొడుకు నాగార్జునసాగర్‌తో పాటు మిర్యాలగూడకూ దరఖాస్తు చేయడం విశేషం. మరో వైపు అందోల్ నుంచి దామోదర రాజానర్సింహాతో పాటు కూతురు త్రిష, ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, పినపాక నుండి సీతక్క కుమారుడు సూర్యంలు దరఖాస్తు చేశారు. అంతేగాక హుజుర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుండి ఉత్తమ్ సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిలు అప్లై చేశారు. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి కూడా దరఖాస్తు చేశారు.
లాస్ట్ డే అప్లై చేసిన కీలక నేతలు వీరే..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజా నర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలమూరి వెంకట్ తదితరులు లాస్ట్ డే దరఖాస్తు చేశారు. దీంతో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొంత నియోజక వర్గాలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే జానారెడ్డి ఎక్కడ దరఖాస్తు చేయకపోవడం గమనార్హం.
దీంతో జానారెడ్డి పోటీలో ఉండకపోవచ్చనే అభిప్రాయాలను పార్టీలో మొదలయ్యాయి. అంతేగాక నిజామాబాద్ అర్బన్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీగౌడ్, హుస్నాబాద్ నుండి పొన్నం ప్రభాకర్ గౌడ్, వనపర్తి నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, హుజురాబాద్ నుండి ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్, సిద్ధిపేట్ నుంచి చేనేత విభాగం చైర్మన్ గుడూరి శ్రీనివాస్, ఇల్లందు నియోజకవర్గం నుంచి బానోత్ విజయలక్ష్మీ తదితరులు దరఖాస్తు చేశారు.