ఎఫ్టీఎల్‌ ల్యాండ్‌ను ఆక్రమించి నిర్మాణాలు.. యాక్షన్‌లో హైడ్రా..!

చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది.

Update: 2024-09-19 02:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. హైడ్రా మొత్తం 74 రోజు ల ‘డిమాలిషన్ ఆపరేషన్’లో 23 ప్రాంతాల్లోని 262 కట్టడాలను కూల్చివేసింది. పొలిటికల్ లీడర్లతో పాటు సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తల షెడ్లు, కమర్షియల్ కాంప్లెక్సులను నేలమట్టం చేసింది. మొత్తంగా 111.72 ఎకరాల చెరువుల భూముల్ని రికవరీ చేసిన విషయం తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్, డెవలపర్స్ చేపట్టిన నిర్మాణాలపై నిఘా పెట్టింది. చెరువులు, బఫర్ జోన్లలోని నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు హైడ్రా అధికారులు చెబుతున్నారు.

కోమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమణపై

నిజాంపేట్ మున్సిపల్ పరిధి బాచుపల్లి గ్రామంలోని కోమటికుంట ఎఫ్టీఎల్‌ను ఆక్రమించి వాసవీ అర్బన్ నిర్మాణ సంస్థ రెండు భారీ భవనాల నిర్మాణం చేపట్టింది. ఎఫ్టీఎల్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేబడుతోందని ఇరిగేషన్ ఏఈతో పాటు, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ బాచు పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఎన్ఓసీని కూడా ఇరిగేషన్ శాఖ రద్దు చేసింది. కాగా, సంబంధిత నిర్మాణాలకు హెచ్ఎండీఏ అధికారులు అనుమతి ఇచ్చారని, నిర్మాణ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. ఈ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏకు హైకోర్టు సూచించింది. తాజాగా ఈ నిర్మాణాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.

హైడ్రా అధికారుల సర్వే..

కోమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్టీఎల్‌కు సంబంధించిన ఎకరం స్థలంలో రెండు భారీ నిర్మాణాలను అధికారులు పరిశీలించారు. హెచ్ఎండీఏ అధికారులు ఇచ్చిన అనుమతులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ, ఆ తర్వాత ఎన్ఓసీ రద్దు వంటి అంశాలను హైడ్రా అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

లీగల్ టీమ్..

చెరువులు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల ఆక్రమణల విషయంలో పలు నిర్మాణ సంస్థలు కోర్టుకెళ్లడం, స్టేలు తీసుకున్న అంశాల పై పరిశీలించడంతో లీగల్ ఒపీనియన్ కోసం ప్రత్యేకంగా లీగల్ టీమ్ ను సైతం ఏర్పాటు చే యాలని హైడ్రా నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాల ఆక్రమణలకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది.

నోయిడా ట్విన్ టవర్ల మాదిరిగా...

నోయిడా జంట భవనాలు అపెక్స్ 32 అంతస్తు లు, సియానే 29 అంతస్తులను 2022లో 9 ని మిషాల్లోనే నేలమట్టం చేశారు. వాటిని కూల్చడానికి 3700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భ వనాలను కూల్చడానికి రూ.20కోట్లు ఖర్చు చే సింది. 2020లో కేరళలో ఇదే తరహాలో కూల్చివేతను నిర్వహించారు. నాలుగు భారీ అపార్ట్‌ మెంట్లను నేలమట్టం చేశారు. కూల్చివేతకు రూ.3.6 కోట్లు ఖర్చుచేసినట్టు తెలిసింది. కోమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమించి నిర్మించిన 23 అంతస్తుల భవనాలను నోయిడా తరహాలో కూల్చేయడానికి హైడ్రా అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

ఆధునాతన యంత్రాలు..

బహుళ అంతస్తుల భవనాలను కూల్చడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చుకునేందు కు హైడ్రా కసరత్తు ప్రారంభించింది. అందుకు ఖర్చుతో నిమిత్తం లేకుండా మోడ్రన్ మిషన్ల కో సం త్వరలోనే టెండర్లు పిలవాలని నిర్ణయించింది. రోజుల తరబడి కాకుండా గంటల వ్యవధిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేవిధంగా యంత్రాలను హైడ్రా సేకరించనుంది.

కూల్చేయాలి : బీజేపీ నేత సతీశ్

కోమటికుంట ఎఫ్టీఎల్‌ను ఆక్రమించి వాసవి సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని నిజాంపేట్ బీజేపీ నాయకుడు ఆకుల సతీశ్ డిమాండ్ చేశారు. చెరువు స్థలానికి బదులుగా వేరే స్థలాన్ని పరిహారంగా ఇస్తామనడం చట్టం విరుద్ధమన్నారు. అనుమతులిచ్చిన హెచ్ఎండీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

జలవిహార్ పై చర్యలు తీసుకోండి : సీపీఐ

పర్యావరణానికి విఘాతం కల్గిస్తున్న జలవిహార్ లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.


Similar News