CM నుంచి అటెండర్ వరకు.. ఇక బయోమెట్రిక్ అటెండెన్స్!

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు ఆఫీసుల్లో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్ ను అమల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.

Update: 2024-06-11 02:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు ఆఫీసుల్లో త్వరలో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ముందుగా సెక్రటేరియట్ నుంచే శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సచివాలయంలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు సీఎంతో సహా, మంత్రులు, సీఎస్, సెక్రటరీల నుంచి మొదలుకుని కిందిస్థాయి అటెండర్ వరకు పంచింగ్ చేయడం తప్పనిసరి చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచేందుకు బయోమెట్రిక్ అడెండెన్స్ తప్పనిసరి చేయాలని సీఎం యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

సీఎం, సీఎస్‌లకూ పంచింగ్ తప్పనిసరి

ప్రభుత్వ ఉద్యోగుల అటెండెన్స్‌పై వస్తున్న విమర్శలను సీఎం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ముందుగా సెక్రటేరియట్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ ను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు ఇచ్చే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. ‘బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అందరూ పాటించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ముందుగా నేను, సీఎస్ ఆఫీసుకు రాగానే పంచ్ చేస్తాం. అలాగే ఇంటికి వెళ్లేటప్పుడు కూడా పంచ్ చేసి వెళ్లిపోతాం. దీంతో మంత్రులు, ఐఏఎస్ లు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా పంచింగ్ చేస్తారు’ అని సీఎం తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్టు తెలిసింది. సీఎం, సీఎస్, మంత్రులు అందరూ బయోమెట్రిక్ హాజరు పాటించడం వల్ల కింది స్థాయి ఎంప్లాయీస్ నుంచి విమర్శలకు ఆస్కారం ఉండదని సీఎం భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు వివరించారు.

విమర్శలకు చెక్ పెట్టేందుకు..

ప్రభుత్వ ఉద్యోగుల అటెండెన్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఎవరూ టైంకు ఆఫీసులకు చేరుకోరని, లేట్‌గా వచ్చి, ఎర్లీగా ఇంటికి వెళ్తారని ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసులకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆఫీసుకు వచ్చినప్పుడు, అలాగే ఇంటికి వెళ్లేటప్పుడు కూడా పంచింగ్ చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఉన్న నెగిటివ్ ఒపీనియన్ పోతుందనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్టు సమాచారం.

ఇందుకోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు చర్చ జరుగుతున్నది. బయోమెట్రిక్ వల్ల ఉద్యోగులపై మానిటరింగ్ కూడా ఏర్పడి, పనుల్లో వేగం పెరగడం, ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారమయ్యే చాన్స్ ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. అయితే మొదట్లో ఎంప్లాయీస్ నుంచి విమర్శలు వచ్చినా, చివరికి ప్రజల నుంచి ప్రశంసలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అన్ని స్కూల్స్ లో బయోమెట్రిక్

ఇప్పటికే కొన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో టీచర్లకు బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. మిగతా స్కూల్స్‌లో కూడా అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వ స్కూల్స్‌లో బయోమెట్రిక్ అమలు చేయడం వల్ల వస్తున్న ఫలితాలపై ప్రభుత్వం ఆరా తీయగా.. పాజిటివ్ రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. బయోమెట్రిక్ అమలు చేస్తున్న స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లలో జవాబుదారి తనం పెరిగింది. ఇన్ టైమ్ లో స్కూల్స్‌కు వెళ్లి, పిల్లలకు పాఠాలు బోధించాలనే తపన సదరు టీచర్లలో వచ్చిందని విద్యాశాఖ వర్గాల్లో టాక్.


Similar News