జూన్ 2 తో కాలం చెల్లింది.. వాటిని ఉమ్మడి జాబితా నుంచి విముక్తి చేయాలి: మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్
రాష్ట్ర విభజన చట్టానికి జూన్ 2 తో కాలం చెల్లిందని మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర విభజన చట్టానికి జూన్ 2 తో కాలం చెల్లిందని మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన చట్టానికి జూన్ 2 తో కాలం చెల్లిందని, పదో షెడ్యూల్ లో ఉన్న విద్యా సంస్థలు, తెలుగు, డా. బీఆర్ అంబేద్కర్ వంటి విశ్వవిద్యాలయాలను ఉమ్మడి జాబితా నుంచి విముక్తి చేయాలని వెల్లడించారు. అది వెంటనే ప్రారంభించాలని, అలాగే హైదరాబాద్ విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు తెలంగాణా వారికే పరిమితం చేయాలని కోరారు. దీనికి సంబంధించి వెంటనే తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ సీఎంవో, సీఎస్‌కు ట్యాగ్ చేశారు.
కాగా, జూన్ 2న ఉమ్మడి రాజధాని పదేళ్లు గడువు ముగియడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతికి పూర్తి బాధ్యత వచ్చిన విషయం తెలిసిందే. కానీ, రాష్ట్ర విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన తేలలేదు. ఇప్పటికే అత్యంత కీలకమైన ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య గతంలో పరిష్కారమైంది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ వివాదం అలాగే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
సెక్షన్-95 ప్రకారం విద్యార్థులకు పదేళ్ల పాటు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించారు. ఆర్టికల్ 317 డీ ప్రకారం అడ్మిషన్ల కోటా పదేళ్ల వరకు కొనసాగించాలి. అయతే, ఇటీవల 7 రకాల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు జూన్ 2కు ముందే విడుదల కావటంతో అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ ఒక్క ఏడాది ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిస్తారు.