నోరు విప్పుతున్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు.. కొందరు బీఆర్ఎస్​ నేతల పేర్లు వెల్లడి!

ఫోన్ ​ట్యాపింగ్​ కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2024-03-18 16:06 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్ ​ట్యాపింగ్​ కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన సస్పెండైన డీఎస్పీ ప్రణీత్​రావు రెండో రోజు విచారణలో కొంతమంది బీఆర్ఎస్​నాయకుల పేర్లను వెల్లడించినట్టు సమాచారం. దాంతోపాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో పాటు మరికొందరు నాయకుల ఫోన్లను ట్యాప్​ చేసిన విషయాన్ని అంగీకరించినట్టు తెలిసింది. దీంట్లో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉన్నట్టుగా ప్రణీత్​రావు చెప్పినట్టుగా తెలియవచ్చింది. దాంతోపాటు పలువురు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల ఫోన్లను కూడా ట్యాప్​చేసినట్టుగా వెల్లడించినట్టు సమాచారం.

ఇక, ప్రణీత్​రావు ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ నుంచి కూడా దర్యాప్తు అధికారులకు కీలకమైన సమాచారం తెలిసినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఫోన్​ట్యాపింగ్​కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న సస్పెండెడ్​డీఎస్పీ ప్రణీత్​రావును ప్రత్యేక విచారణ బృందం కోర్టు అనుమతితో వారం రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజైన సోమవారం జూబ్లీహిల్స్​ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం ప్రణీత్​రావును బంజారాహిల్స్​పోలీస్​స్టేషన్​కు తరలించి ఏడు గంటలకు పైగా ప్రశ్నించింది.

రెండో రోజు జరిగిన ఈ విచారణలో ప్రణీత్​రావు బీఆర్ఎస్​పార్టీలోని కొంతమంది కీలక నేతల పేర్లను వెల్లడించినట్టుగా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​నేత ఎర్రబెల్లి దయాకర్​రావు సూచనల మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో వార్​రూం ఏర్పాటు చేసి మరీ ప్రణీత్​రావు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులతోపాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాప్​చేయించినట్టుగా ఇప్పటికే దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా వార్​రూంలు ఏర్పాటు చేసినట్టుగా అనుమానాలు ఉన్న నేపథ్యంలో సోమవారం జరిగిన విచారణలో ప్రత్యేక బృందం ఈ అంశం పైనే ఎక్కువగా ప్రశ్నించినట్టుగా సమాచారం.

మొదట సమాధానాలు చెప్పటానికి ఇష్టపడని ప్రణీత్​రావు ఆ తరువాత కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన కొందరు బీఆర్ఎస్​నాయకుల పేర్లను వెల్లడించినట్టుగా తెలియవచ్చింది. దాంతోపాటు ఫోన్లు ట్యాపింగ్​చేయాలని తనకు సూచించిన కొందరు అధికారుల పేర్లను కూడా ప్రణీత్​రావు చెప్పినట్టుగా సమాచారం ఇక, ప్రణీత్​రావు నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలు కీలక అంశాలు ఉన్నట్టుగా తెలియవచ్చింది. దీంట్లో కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఆర్ఎస్​పార్టీకి చెందిన పలువురి పేర్లు, ఫోన్​నెంబర్లు ఉన్నట్టు సమాచారం. పదుల సంఖ్యలో ప్రైవేట్​వ్యక్తుల ఫోన్​నెంబర్లు కూడా ఉన్నట్టుగా తెలిసింది. దీనిపై ప్రత్యేక విచారణ బృందం ప్రణీత్​రావును నిశితంగా ప్రశ్నించినట్టుగా సమాచారం.

ఆ ఆరుగురిని కూడా..

ఇక, ఎస్ఐబీలో ఉన్న సమయంలో ప్రణీత్​రావు తన టీం కోసం ప్రత్యేకంగా రెండు గదులను కేటాయించుకుని 17 కంప్యూటర్లు సమకూర్చుకుని ఫోన్లను ట్యాప్​చేసినట్టుగా ఇప్పటికే విచారణలో స్పష్టమైన విషయం తెలిసిందే. కాగా, ఈ ఆఫీస్​లో ఆరుగురు అధికారులు నిరంతరం పని చేసినట్టుగా ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో గుర్తించిన ఆరుగురు అధికారులను ఒక్కొక్కరిగా ఆ తరువాత అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి విచారించాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలియవచ్చింది. ఇదిలా ఉండగా ధ్వంసం చేసిన 17 కంప్యూటర్లలోని సమాచారాన్ని ప్రణీత్​రావు తన వ్యక్తిగత పెన్​డ్రైవ్​లలో అప్​లోడ్​చేసుకున్నట్టుగా విచారణ బృందం గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలో పెన్​డ్రైవ్​లు ఎక్కడ ఉన్నాయన్న దానిపై కూడా ఆరా తీసినట్టుగా తెలిసింది. ఇక, సోమవారం ప్రణీత్​రావును వెంటబెట్టుకుని ఎస్ఐబీ కార్యాలయానికి వెళ్లిన దర్యాప్తు అధికారులు సీన్​రీ కన్​స్ర్టక్షన్​చేసినట్టుగా తెలియవచ్చింది.

Tags:    

Similar News