కాంగ్రెస్ ఎల్లకాలం అధికారంలో ఉండదు: మాజీ ఎంపీ వినోద్ కుమార్
కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అధికార పక్షం మారినంత మాత్రాన శిలాఫలకాలు తొలగించడం సబబు కాదన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్, అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శిలాఫలకాలను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే సీఎం క్యాంప్ ఆఫీసులను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది అని, ఆది ప్రజల ఆస్తి అన్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి, వాటి స్థానంలో వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తాం.. చెడు చేస్తే సమస్యలపై నిలదీస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఏర్పడింది తెలంగాణ కోసమని.. ప్రజల పక్షాన నిలబడతామన్నారు. గతంలో కాంగ్రెస్ చరిత్రను మర్చిపోవద్దని హితవుపలికారు. ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీలో కాంగ్రెసుకు ప్రజలు ఇచ్చిన తీర్పును మర్చిపోవద్దన్నారు. ప్రజల తీర్పుతోనే తాము సైతం ప్రతిపక్షంలో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.