సీఎం రేవంత్ రెడ్డి కళ్లలో ఆనందం లేదు: బూర నర్సయ్య గౌడ్

రాష్ట్రంలో కాంగ్రెస్‌కే గ్యారంటీ లేదని, ఇంకా వారు సిక్స్ గ్యారంటీలు ఏం అమలు చేస్తారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.

Update: 2024-01-01 15:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్‌కే గ్యారంటీ లేదని, ఇంకా వారు సిక్స్ గ్యారంటీలు ఏం అమలు చేస్తారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఏడాది తెలంగాణ ఆస్తులు పెరిగి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది కేవలం శ్వేతపత్రం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ఏం చేయలేక కాలయాపన చేస్తున్నారని చురకలంటించారు. రాష్ట్ర ప్రజలు మోసపోతే గోస పడతారని బూర పేర్కొన్నారు. బీఆర్ఎస్ చెమటోడ్చి రూ.6.32 లక్షల కోట్ల అప్పు చేసిందని సెటైర్లు వేశారు. బీజేపీ చేసేది కొండంత అయినా.. చెప్పేది గోరంత మాత్రమేనని, ఇతర పార్టీలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రూ.9.36 లక్షల కోట్లు తెలంగాణకు కేటాయించిందని బూర తెలిపారు. మోడీ వేసిన రోడ్ల వల్లే రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడంలేదని మండిపడ్డారు. మోడీ.. జెన్ కో, ట్రాన్స్ కోకి రూ.80 వేల కోట్ల అప్పు ఇస్తే.. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారని బూర తెలిపారు. రాష్ట్ర ఖజానా లేదని, అందుకే సీఎం రేవంత్ కళ్ళలో ఆనందం లేకుండాపోయిందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కేసీఆర్ మొత్తం గీకేసిపోయాడని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని బూర కోరారు.

Tags:    

Similar News