మునుగోడు టికెట్ బీసీకే ఇవ్వాలి.. TRS మాజీ ఎంపీ అనూహ్య వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో రసరవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో రసరవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు గతంలో ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా గత రెండు ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ బైపోల్‌లో ఎలాగైనా గెలిచి చూపించాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు సైతం ముమ్మరం చేసింది. అయితే, ఈ క్రమంలో టీఆర్ఎస్ అధిష్టానానికి కొత్త చిక్కు వచ్చి పడింది. మునుగోడు నియోజకవర్గంలో బీసీల ఎట్లు ఎక్కువగా ఉండటంతో బరిలో నిలిచే అవకాశం బీసీలకు ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. ఇప్పటికే తానే అభ్యర్థిని అంటూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులకు, స్థానిక టీఆర్ఎస్ నేతలకు హింట్ ఇస్తున్నారు. అంతేగాక, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తనకు హామీ ఇచ్చినట్లు అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్ఎస్ కీలక నేత బూర నర్సయ్య గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్లు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బీసీ అభ్యర్థినే ప్రకటించాలని అధిష్టానికి డిమాండ్ చేశారు. మునుగోడులో 67 శాతం బీసీ ఓట్లు ఉన్నాయని, తాము సీటు అడగటంలో తప్పులేదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో 12సార్లు ఎన్నికలు జరిగితే రెడ్డి, వెలమ కులాల వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని, ఈసారి బీసీలకు చాన్స్ ఇవ్వాలని గుర్తుచేశారు.