ప్రీతిది హత్యా.. ఆత్మహత్యా.. ప్రభుత్వం తేల్చాల్సిందే: మాజీ MP బూర డిమాండ్

మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రీతి ఎన్నో కష్ట నష్టాలు భరించి మెడికల్ పీజీ స్థాయికి చేరుకుందని, అలాంటిది ఆ యువతిది హత్యా? ఆత్మహత్యా అనేది ఇప్పటికీ ప్రభుత్వం తేల్చలేకపోయిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

Update: 2023-03-01 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రీతి ఎన్నో కష్ట నష్టాలు భరించి మెడికల్ పీజీ స్థాయికి చేరుకుందని, అలాంటిది ఆ యువతిది హత్యా? ఆత్మహత్యా అనేది ఇప్పటికీ ప్రభుత్వం తేల్చలేకపోయిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, వాటిపై ప్రభుత్వ స్పందన చూస్తే అహంకారం, అణచివేతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని విమర్శలు చేశారు.

హత్యల్లో తెలంగాణ.. బీహార్‌ను మించిపోయిందని మండిపడ్డారు. ప్రీతిది హత్యనా.. ఆత్మహత్యనా అనేది ప్రభుత్వం ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. ఒక అమ్మాయి సొంతంగా ఇంజక్షన్ వేసుకుందంటే నమ్మలేకపోతున్నానని ఆయన వాపోయారు. దీనికి చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలని, పీజీలో చేరిన కొన్ని నెలలకే ఇంత కచ్చితంగా ఇంజక్షన్ గురించి తెలియడం చాలా కష్టమని అనుమానం వ్యక్తంచేశారు.

ఎవరైనా ఇంజక్షన్ ఇచ్చారా అనే కోణంలో పూర్తి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి 5 రోజుల పాటు మెడికల్ వెంటిలేటర్ మీద లేదని, పొలిటికల్ వెంటిలేటర్ మీద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రీతి ఫోన్, వాట్సాప్ డేటా ఎలా, ఎవరు డిలీట్ చేశారని, ఆమె నంబర్ నుంచే వారి తల్లిదండ్రులకు కాల్ ఎలా వెళ్ళిందనేది విచారణలో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదంతా రాజకీయం చేయాలని తాను చెప్పడం లేదని, మానవతా దృక్పథంతో, ఆవేదనతో చెబుతున్నట్లుగా వెల్లడించారు.

అదే అన్యాయం పెద్ద కులస్తులకు జరిగితే తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్‌గా ఎన్ కౌంటర్ చేయడమో, లేదా రైలు ప్రమాదంలో మృతి చెందాడనే వార్తనో చెప్పేవారని సెటైర్లు వేశారు. అదే సీఎంకి, ప్రభుత్వానికి ఆప్తులైన వారిపై ఏమాత్రం చర్యలు ఉండవన్నారు. మంత్రి కేటీఆర్.. సైఫ్ అయినా సంజయ్ అయినా చర్యలు తప్పవని కామెంట్స్ చేశారని, అయితే ఆయన చేతల్లో చూపించుకోవాలని సవాల్ విసిరారు.

ఇటీవల ఒక యువకుడు తన స్నేహితుడి గుండె తీశాడని, మొన్న నడి రోడ్డుపై నరుక్కున్నారని, జూబ్లీహిల్స్ రేప్ కేసు వంటివన్నీ లిక్కర్, గంజాయి వినియోగం వల్లేనని ఆయన వెల్లడించారు. కుక్కల దాడిలో బాలుడు మృతిచెందినా సర్కార్ పట్టించుకోలేదని, బీఆర్ఎస్ నేతలకు సెకండ్ షో సినిమా పూర్తయ్యే టైంకి బైక్ ఇచ్చి వీధుల్లోకి పంపిస్తే కుక్కల బెడద ఎలా ఉందో వారికి అర్థమవుతుందన్నారు. ఉడ్తా హైదరాబాద్‌గా పరిస్థితి తయారైందని ఆయన మండిపడ్డారు.

ముస్లింలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాలని బూర నర్సయ్య గౌడ్ సూచించారు. సీఎం ఒక్క బిర్యానీ ఇచ్చి జీవితాంతం వాడుకునే వ్యక్తి అని ఘాటు విమర్శలు చేశారు. ఈ విషయంలో ముస్లింలంతా ఒక్కసారి ఆలోచించాలిని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లో ముస్లింలకు సీఎం కేసీఆర్ ఎంత కేటాయించాడని, వారికి ఆయన చేసిందేంటని ఆలోచన చేయాలని ఆయన సూచించారు.

రంజాన్ కు వచ్చి టోపి పెట్టుకుని.. ముస్లింలకు టోపి పెడుతున్నాడని పేర్కొన్నారు. 2 చికెన్ ముక్కలు పెట్టి ముస్లింలను దోచుకుంటున్నాడని వెల్లడించారు. కేసీఆర్ ది ఫ్యామిలీ పార్టీ అని ఆయన కుటుంబం బాగుంటే చాలనే మనస్తత్వమని చెప్పారు. కేసీఆర్ ది అవినీతి కుటుంబమని బూర నర్సయ్య గౌడ్ ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సుధగాని హరి శంకర్, రాష్ట్ర మహిళ నాయకురాలు విజయలక్ష్మి, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, డాక్టర్లు సమత, రామకృష్ణ, భాస్కర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News