Harish Rao- Bandi Sanjay:తెలుగు భాష గొప్పతనాన్ని వివరించిన మాజీ మంత్రి హరీష్ రావు&బండి సంజయ్

నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికన తెలుగు ప్రజలందరికీ తెలుగు భాష శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Update: 2024-08-29 07:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికన తెలుగు ప్రజలందరికీ తెలుగు భాష శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు అండ్ బండి సంజయ్ ట్విట్టర్ వేదిన తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలవబడే సుందరమైన భాష మన తెలుగు. అమ్మలా ఆత్మీయతను చాటే విశిష్టమైన భాషను మనకు అందించేందుకు కృషి చేసిన గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్బంగా వారిని స్మరించుకుంటూ, భాష అభివృద్ధికి కృషి చేసిన మహనీయులందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వందనాలు. అమ్మ భాష తెలుగులో ప్రేమతో కూడిన స్పర్శ ఉంటుంది. కానీ ఉరుకుపరుగుల ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు నేటితరానికి అమ్మ భాషను అందించటంలో నామోషిగా భావిస్తున్నారు. వేల సంవత్సరాలుగా వెలుగులు విరజిమ్ముతున్న మన తెలుగును కాపాడుకుందాం. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష కోసం కృషి చేసిన గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకొని ఈరోజు ఆయనను స్మరించుకోవడం తెలుగు ప్రజల అదృష్టం’ అని హరీష్ రావు రాసుకొచ్చారు.‘నిద్రలో కూడా ఆలోచనలను మేల్కొల్పేది, ఆఖరి శ్వాసలో కూడా జ్ఞాపకాలను గుర్తు చేసేది తెలుగు భాష మాత్రమే. భాషను మరువద్దు, ఆ శ్వాసను విడువద్దు.తెలుగు అనేది కేవలం భావవ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదు, యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం కూడా. తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడే ప్రతి తెలుగు వ్యక్తికి ఈ రోజు మరింత స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి హృదయపూర్వకంగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు’. అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.


Similar News